పార్టీ పేరులో తొలగిన ‘తెలంగాణ’ పదం
బీఆర్ఎస్ తెలంగాణ అధ్యక్షులుగా కేటీఆర్?
ఈ సారి ఇంట గెలిచి తర్వాత రచ్చ గెలిచేలా ప్లాన్!
భారత రాష్ట్ర సమితి గెలుపునకు కేసీఆర్ విశ్వప్రయత్నాలు!

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చిన సంగతి అందరికీ విదితమే. అలా తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా ‘భారత రాష్ట్ర సమితి’గా మారింది. అయితే, పార్టీ పేరులో ‘తెలంగాణ’ అనే పదం తొలగిన నేపథ్యంలో కేసీఆర్‌కు రాష్ట్రంతో ఉన్న పేగుబంధం తెగిపోయిందని పలువురు ఇతర పార్టీల నాయకులు విమర్శిస్తున్నారు. అయితే, కేసీఆర్ పార్టీ విస్తరణలో మాత్రం వడివడిగా అడుగులు వేస్తున్నట్లు కనబడుతున్నది.
ఏపీ నుంచి బీఆర్ఎస్‌లోకి నేతల చేరికలు కేసీఆర్ సమక్షంలో జరిగాయి. ఈ క్రమంలోనే ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షులుగా తోట చంద్రశేఖర్‌ను కేసీఆర్ నియమించారు. ఒక్క ఏపీలోనే కాదు దేశంలోని రాష్ట్రాలన్నిటిలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కమిటీలను వేయబోతున్నట్లు కేసీఆర్ తెలిపారు. అయితే, తొలుత ఎలాగైనా ఇంట గెలిచేలా అంటే తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇంట గెలిస్తే ఆటోమేటిక్‌గా రచ్చ గెలవడం సులువు అవుతుందనే ఉద్దేశంతో తెలంగాణలో బీఆర్ఎస్ గురించి విస్తృత ప్రచారం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఏపీ అధ్యక్షులుగా తోట చంద్రశేఖర్‌ను నియమించిన కేసీఆర్.. బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షులుగా, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఎవరిని నియమిస్తారనే చర్చ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేటీఆర్‌ను తెలంగాణ అధ్యక్షులుగా నియమించి, జాతీయ అధ్యక్షులుగా కేసీఆర్ కొనసాగే అవకాశాలుండొచ్చనే వాదనలూ వినిపిస్తున్నాయి. తెలంగాణ ఇప్పటికే ఎన్నికల సంవత్సరం 2023లోకి అడుగు పెట్టిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ గెలుపునకు మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తు్న్నారని, డెఫినెట్‌గా ఈసారి కూడా అద్భుతమైన మెజారిటీతో తాము గెలుస్తామని, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా, ముచ్చటగా మూడోసారి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందా? లేదా? అనేది తెలియాలంటే ఈ ఏడాది చివరి వరకు వెయిట్ చేయాల్సిందే.