• ఆధునిక టెక్నాలజీతో కొత్తపుంతలు
  • సింగరేణి 103వ ఆవిర్భావ వేడుకలు

వేద న్యూస్, మంచిర్యాల ప్రతినిధి:
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ పేరు వినగానే రాష్ట్రంలో బొగ్గు గనులు గుర్తుకు రావడం సహజం. బొగ్గు ఉత్పత్తిలో అధునాతన టెక్నాలజీని ఉపయోగిస్తూ, ప్రతి యేటా నిర్దేశిత లక్ష్యాలను అధిగమిస్తూ, ప్రగతిపథంలో దూసుకుపోతున్న సింగరేణి సంస్థ నేడు 103వ యేటాకు అడుగుపెట్టబోతోంది. సరిగ్గా 136 సంవత్సరాల క్రితం 1886 సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించిన సంస్థ, 1920 సంవత్సరంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ గా పేరు నమోదు కాబట్టి సింగరేణి సంస్థగా రూపాంతరం చెంది, శతాబ్దం కాలంగా దినదినం అభివృద్ధి చెందుతూ, దక్షిణ భారతదేశానికి వెలుగులు పంచుతూ, ప్రగతి పథంలో పయనిస్తూ, ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ, తెలంగాణ కొంగ బంగారంగా విరాజిల్లుతుంది.

ఆధునాతన టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటూ, ఉత్పత్తి, ఉత్పాదకతలో పురోభివృద్ధి సాధిస్తూ, ఏటేటా వార్షిక లక్ష్యాలను అధిగమిస్తూ, దినదినం అభివృద్ధి పధంలో సింగరేణి సంస్థ తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ప్రకృతికి విరుద్ధంగా భూగర్భ గనుల్లో సైతం మెరుగైన టెక్నాలజీతో ఉత్పత్తి లక్ష్యాలను చేదిస్తుంది. గుడ్డి దీపం కాంతుల నుండి ఎల్ఈడి కాంతులు నడుమ శోభిల్లుతూ, కార్మికుల ప్రయాసను తగ్గించింది. గతంలో కిలోల బరువున్న దీపపు వెలుగులో భారంగా పనిచేసిన కార్మికులకు తేలికపాటి ఎల్ఈడి దీపాలను అందించి, ఇటువంటి అనేకం నిర్వహించి, ఉత్పత్తి, ఉత్పాదకత కాకుండా కార్మిక శ్రేయస్సు సైతం ముఖ్యమని నిరూపించింది.

అందివచ్చిన శాస్త్ర, సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ, బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను గణనీయంగా పెంచుకుంటూ, నిర్దేశించిన లక్ష్యాలను అధిగమిస్తూ, ఏటా లాభాలు గడిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థగా రికార్డును సొంతం చేసుకుంటుంది. వార్షిక లక్ష్యాలను అధిగమించడం తోపాటు గనుల్లో కార్మికులకు రక్షణ చర్యలు సమర్థవంతంగా అమలు చేస్తూ, రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తే ధ్యేయంగా ముందుకు నడుస్తుంది.

సింగరేణి సంస్థలో గతంలో సమ్మెలకు, పోరాటాలకు పెట్టింది పేరుగా ఉండగా, వరుస సమ్మెల మూలంగా సంస్థ నష్టాలలో కూరుకుపోగా, 1998 బిఐఎఫ్ఆర్ కు నివేదించగా, సింగరేణి సంస్థను లాభాల బాట పట్టించేందుకు కార్మికులు, అధికారులు కృషి చేయాలని, సంస్థ లాభాలను సాధిస్తే లాభాల వాటా అమలు చేస్తామని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనను కార్మికులు, అధికారులు సవాలుగా స్వీకరించి, ఉత్పత్తి పెంచడంతో 1998వ సంవత్సరం నుండి నేటి వరకు వరుసగా లాభాలను సాధిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి సంస్థగా రికార్డులను సృష్టిస్తోంది.

ఉత్పత్తి లక్ష్యాలను ప్రతియేటా పెంచుకుంటూ, కోలిండియా స్థాయిలో అత్యధిక బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతను సాధిస్తున్న సంస్థగా నిలుస్తుంది. బొగ్గు ఉత్పత్తి సంస్థల్లో అత్యధిక బొగ్గు ఉత్పత్తి సాధించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి తోపాటు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి రంగంలో ప్రవేశించింది. ఇందులో భాగంగా 2016 సంవత్సరంలో జిల్లాలోని జైపూర్ మండలంలో థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని 600 మెగావాట్ల సామర్థ్యం గల 2 కేంద్రాలను నిర్మించి, సమర్థవంతంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ, విద్యుత్ రంగంలో సైతం తనదైన ముద్రను వేసుకుంటుంది.

థర్మల్ విద్యుత్ తోపాటు సోలార్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటు దిశగా అడుగులు వేసి, సింగరేణి వ్యాప్తంగా సోలార్ విద్యుత్ కేంద్రాలను ప్రారంభించింది. త్వరలోనే సింగరేణి సంస్థ నీటి పై తేలి ఆడే సోలార్ విద్యుత్ ప్రాజెక్టు , భూగర్భంలోని వేడి నీటితో జియా థర్మల్ విద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించేందుకు శరవేగంగా ముందుకు సాగుతోంది.

ఇతర రాష్ట్రాలకు విస్తరించే దిశగా..
తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి సంస్థలో అగ్రగామి సంస్థగా పేరు సంపాదించింది.తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు ఉత్పత్తికి పరిమితమయిన సంస్థ ఇతర రాష్ట్రాల్లో సైతం బొగ్గు ఉత్పత్తి చేపట్టేందుకు అడుగులు వేస్తోంది. ఒరిస్సా రాష్ట్రంలో నైని, పార్ధప్రద బొగ్గు క్షేత్రాలలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది. కాగా ఒడిస్సా రాష్ట్రం నుండి నిర్వహిస్తున్న తవ్వకాలు నుంచి త్వరలోనే బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కానుంది. కాగా బొగ్గు రంగంలో తనదైన ముద్ర వేసుకున్న సింగరేణి సంస్థకు కేంద్ర నిర్ణయం సింగరేణి అభివృద్ధికి అడ్డంకిగా మారిందనే సంశయం ప్రస్తుత పరిస్థితిలో ప్రజల్లో నెలకొంది.

బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరించడం, బడా పారిశ్రామిక వేత్తలు, థర్మల్ విద్యుత్ కేంద్రాల యాజమాన్యాలు బొగ్గు బ్లాకుల వేలం పాటలో బొగ్గు బ్లాకులను దక్కించుకునే వెసలు బాటు కేంద్ర ప్రభుత్వం కల్పించింది. అదేవిధంగా విదేశాల నుండి బొగ్గును దిగుమతి చేసుకునేందుకు అడ్డంకులు వెలిగించడంతోపాటు ఖచ్చితంగా విదేశీ బొగ్గును కొనుగోలు చేయాలని బొగ్గు ఆధారిత పరిశ్రమలకు ఉత్తర్వులు జారీచేసింది. ఈ తరుణంలో సింగరేణి మరిన్ని బొగ్గు బ్లాకులను కేటాయించడం, ఉత్పత్తి చేసిన బొగ్గును వినియోగదారులు కొనుగోలు చేయడం పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. సింగరేణి యాజమాన్యానికి కేంద్ర ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందనే ఆశాభావం సింగరేణి వ్యాప్తంగా నెలకొంది.

కార్మికుల సంక్షేమానికి పెద్దపీట..
బొగ్గు ఉత్పత్తి రంగంలో దూసుకుపోతున్న సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమానికి యజమాన్యం అధిక ప్రాధాన్యం ఇస్తూ వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ,సంక్షేమ కార్యక్రమాల అమలులో పెద్దపీట వేస్తోంది. కార్మిక కాలనీలో మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో గనులపై కార్మికుల సౌకర్యార్థం అధునాతన స్నానపు గదులు, క్యాంటీన్లు, విశ్రాంతి గదులు, ఆర్వో వాటర్ ప్లాంట్లు లతోపాటు కార్మికుల నివాసాలకు ఏసీలు, కార్మిక కాలనీలో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు గాను పార్కులు ఏర్పాటు చేయడమే కాకుండా కార్మిక, కార్మికేతర కుటుంబ పిల్లలకు వివిధ పోటీ పరీక్షలకు చేయూత అందిస్తోంది.

కరోన విరా తాండవం చేసిన వేళలో కార్మికుల కోవైడ్ వార్డులు, ఐసోలేషన్ సెంటర్లు, ఆక్సిజన్ ప్లాంట్ లను ఏర్పాటు చేసి కార్మికులను కాపాడింది. కరోన బారిన పడిన కార్మికులకు ప్రత్యేకంగా సెలవులు అందించి, వారిలో మనోధైర్యాన్ని నింపింది. కార్మికులు, కార్మికుల కుటుంబలు కరోన బారిన పడకుండా వాక్సినేషన్ ను సమర్థవంతంగా నిర్వహించింది.

తెలంగాణకు కొంగుబంగారం.
తెలంగాణ రాష్ట్రం,కేంద్ర ప్రభుత్వం 51:49 శాతం వాటాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సంస్థగా సింగరేణి ప్రతి సంవత్సరం వార్షిక లక్ష్యాలను అధిగమిస్తూ, వేల కోట్ల రూపాయలు లాభాలు ఆర్జిస్తుంది. సింగరేణి సంస్థ తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా రాష్ట్ర అభివృద్ధికి తన వంతు తోడ్పాటును అందిస్తూ, వేలాది మందికి ప్రత్యక్షంగా లక్షలాది మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ, తెలంగాణ రాష్ట్ర కొంగుబంగారంగా విరాజిల్లుతుంది.

రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వ ప్రోత్సాహంతో సింగరేణి సంస్థ ప్రతి ఏటా నిర్దేశించిన లక్ష్యాలను అధిగమిస్తూ, మరిన్ని మైలురాళ్లను అధిగమించి, సంస్థ దేశవిదేశాలలో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ, మరిన్ని అవార్డులు సొంతం చేసుకోవాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. కాగా నేడు సింగరేణి ఆవిర్భావ దినోత్సవం, ఈ సందర్భంగా సింగరేణి వ్యాప్తంగా అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించేందుకు సింగరేణి యాజమాన్యం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.