- చివరి మజిలీలో చిక్కులు
- ఓ వైపు ఆత్మీయులను కోల్పోయిన బాధ..మరో వైపు చీకట్లో కార్యక్రమం
- ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించాలని స్థానికుల విజ్ఞప్తి
వేద న్యూస్, వరంగల్ టౌన్:
చివరి మజిలీ చింత లేకుండా సాగాలని పెద్దలు చెప్తుంటారు. కాగా, గ్రేటర్ వరంగల్ 40వ డివిజన్ కుమ్మరివాడ హిందూ శ్మశాన వాటిక వద్ద ఆఖరి మజిలీకి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఆ శ్మశాన వాటిక సమస్యలకు వేదికగా మారింది. శ్మశాన వాటికలో కనీస వీధి దీపాలు లేక సెల్ ఫోన్ టార్చర్ తో చివరి మజిలీని పూర్తిచేస్తూ మృతుడి కుటుంబ సభ్యులు ఆవేదనకు గురవుతున్నారు.
ఏండ్ల తరబడి లైట్లు వేయకపోవడంతో రాత్రిళ్లు శ్మశాన వాటికను చీకట్లు కమ్ముకుంటున్నాయి. శ్మశానవాటికలో సమస్యల పరిష్కారంలో అటు అధికారులు, ఇటు పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. శ్మశానవాటికను వినియోగించుకునే మృతుల కుటుంబ సభ్యులకు అసలు ఏం చేయాలో దిక్కుతోచడం లేదు.
ఆత్మీయులను కోల్పోయిన బాధలో ఉన్న వారు మృతదేహాన్ని చీకట్లో దహన సంస్కారాలు చేయడానికి చెప్పరాని గోసలు పడుతున్నారు. చివరి మజిలీకి ఇంతటి దారుణమైన చిక్కులు వచ్చాయని బాధపడుతున్నారు. కనీసం ఇప్పటికైనా కుమ్మరివాడ హిందూ శ్మశాన వాటికలోని సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు అధికారులు, నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నారు.