వేద న్యూస్, హన్మకొండ:

హైదరాబాద్ లో శనివారం నిర్వహించిన ‘‘OBC సాధన సభ’’ను సక్సెస్ చేసిన ఆరె కుల బంధువులకు  ఆరె సంఘం నాయకులు ధన్యవాదాలు తెలిపారు. హనుమకొండ బాలసముద్రంలోని ఆరె సంఘ భవనంలో ఆరె సంక్షేమ సంఘం ముఖ్య నాయకుల సమావేశం ఆదివారం నిర్వహించారు. 

ఈ సమావేశంలో ఆరె సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ జెండా రాజేష్ మాట్లాడుతూ ఆరె కులానికి ఓబిసి రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఆరెకుల విద్యార్థులు ఉద్యోగార్ధులు ప్రతిష్టాత్మకమైన కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థలలో ఉద్యోగాలలో తమ వాటాను కోల్పోతున్నారని చెప్పారు. ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి పోతున్నారని భావించి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి ఎట్టి పరిస్థితులలో ఓబీసీ సర్టిఫికెట్ సాధించాలని ఆరె సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యం లో  శనివారం  హైదరాబాదులో ‘‘ఓబీసీ సాధన సభ’’ ఏర్పాటు  చేసినట్లు తెలిపారు.

రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్రంలోని ఆరె కులస్తులందరూ ‘‘చలో హైదరాబాద్’’ పేరుతో సమావేశానికి స్వచ్ఛందంగా తరలివచ్చి తమ కు ఓబీసీ ఎంత అవసరమో తమ ఆకాంక్షను సభ సక్సెస్ ద్వారా తెలిపారని వెల్లడించారు. ఈ సమావేశ ప్రాంగణం, పరిసరాలు ఆరె కులస్తులతో జన విస్ఫోటనంగా  మారిందని పేర్కొన్నారు. 

‘‘ఓబీసీ సర్టిఫికెట్ ఎంత అత్యవసరమో ’ ఈ సమావేశానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు ఆ జన సందోహాన్ని చూడగానే అర్థమైపోయిందని స్పష్టం చేశారు. ఈ సభ ఇంత విజయవంతం కావడంలో ఎంతో కృషి చేసిన ఆరె సంక్షేమ సంఘం గ్రామ, మండల, జిల్లా,రాష్ట్ర కమిటీ సభ్యులకు ఆరెకుల ఉద్యోగులకు వ్యాపారస్తులకు, విద్యావంతులకు ఆత్మీయ కుల బంధువులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమ విజయవంతంలో ముఖ్య భూమిక పోషించిన రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నాగుర్ల వెంకటేశ్వర్లుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.  కార్యక్రమంలో ఆరె సంక్షేమ సంఘం రైతు విభాగం అధ్యక్షులు మోర్తాల చందర్ రావు, క్రమశిక్షణ సంఘం రాష్ట్ర కమిటీ చైర్మన్ మార్జొడు రాంబాబు, రాష్ట్ర కార్యదర్శి పకిడే సాంబారావు, హింగే రాజేశ్వరరావు హనుమకొండ జిల్లా నాయకులు పేర్వాల లింగమూర్తి, లోనె దీపక్ జి, వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు హింగే భాస్కర్ , కౌడగాని నర్సింగరావు, పకిడే సదానందం తదితరులు పాల్గొన్నారు.