- పర్యావరణ పరిరక్షణ ఐక్యవేదిక సభ్యులు
- ప్లాస్టిక్ వినియోగ అవగాహనపై కరపత్రాల ఆవిష్కరణ
- మేడారానికి వచ్చే భక్తులు జాగ్రత్త వహించాలి
- హన్మకొండ జిల్లా జాయింట్ కలెక్టర్ మహేందర్ జి
వేద న్యూస్, హన్మకొండ:
మేడారం జాతరకు వచ్చే భక్తులు వెట్ వెస్ట్, చెత్తాచెదారం బహిరంగ ప్రదేశాల్లో వేయడం వల్ల ప్లాస్టిక్ కాలుష్యం జరుగుతోంది. ఈ కాలుష్యం ద్వారా జాతరలో భక్తులకు, పర్యాటకులకు, అక్కడున్న గ్రామస్తులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దాంతో పాటు అటవీ పర్యావరణ వ్యవస్థలు దెబ్బతిని దుర్గంధము ఏర్పడి సమస్యలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనం అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఉంటున్నాయి. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని ప్రజలను అప్రమత్తం చేయాలని ఉద్దేశంతో భక్తులు జాగ్రత్త వహించాలని కోరుతూ బుధవారం హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ మహేందర్ జి చేతులమీదుగా అవగాహన నిమిత్తం కరపత్రాలు ఆవిష్కరించారు. పర్యావరణ పరిరక్షణ ఐక్యవేదిక (యునైటెడ్ ఫోరం ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్) వారి ఆధ్వర్యంలో ఈ కరపత్రాలు ముద్రించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగాన్ని జాతరలోనే కాకుండా మనం మన చుట్టూ పరిసర ప్రాంతాల్లోనూ నిరోధించాలని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ ఐక్యవేదిక చేస్తున్న కార్యక్రమాలకు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి చేయూతని అందిస్తామని చెప్పి హామీ ఇచ్చారు.
డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ వైవి గణేష్ మాట్లాడుతూ ఇది ఒక మంచి కార్యక్రమం అని చెప్పారు. ప్రజల్లోకి అవగాహన తీసుకెళ్తూ ఆచరణ కూడా మనం అవలంభించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రజలు పర్యావరణం పట్ల అవగాహన కలిగి ఉండి..ఈ ప్లాస్టిక్ ను వ్యతిరేకిస్తూ ముఖ్యంగా మట్టిలో కలిసిపోయే బయోడిగ్రేడబుల్ గ్లాసులు, మట్టి గ్లాసులు, అలాగే స్టీల్ ప్లేట్స్ ఇట్లాంటి వాటిని వినియోగించాలని సూచించారు.
జాతరలో అలాగే చెత్తను తడి, పొడి చెత్తను వేరువేరుగా చేసినట్లయితే..మున్సిపల్ సిబ్బందికి, పారిశుధ్య కార్మికులకు చాలా సౌలభ్యంగా ఉంటుందని వెల్లడించారు. కార్యక్రమంలో యూఈఈపీ బాధ్యులు కె.పురుషోత్తం, శ్రవణ్ కుమార్, వి.శ్రీనివాస్, అనితారెడ్డి, శాంతారామ్ కర్ణ, ఏ.సంపత్ కుమార్, మండల పరుష రాములు, పర్యావరణ వేత్త పిట్టల రవిబాబు తదితరులు పాల్గొన్నారు.