వేద న్యూస్, డెస్క్ :
ఎప్పుడో 2019లో ఆమోదించిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) ఇప్పుడు అమల్లోకి తీసుకొస్తూ మోదీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్‌లో మత మైనారిటీలుగా హింసకు గురై ఎలాంటి పత్రాలూ లేకుండా 2014 డిసెంబరు 31కి ముందు భారత దేశానికి వలస వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం ఇచ్చే చట్టమిది.
ఆయా దేశాల నుంచి ఇక్కడికి వచ్చినవారిలో ముస్లింలు మినహా మిగతా మతాలవారికి హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలు, క్రైస్తవులకు ఈ చట్టం కింద భారత పౌరసత్వం ఇస్తారు. దీనికి దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇందుకోసం ఒక వెబ్‌సైట్‌ను రూపొందించామని కేంద్ర హోం శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ చట్టం కింద భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునేవారిని ఎలాంటి పత్రాలూ అడగబోమని ఆయన వెల్లడించారు. మతప్రాతిపదికన పౌరసత్వాన్ని ఇచ్చే ఈ వివాదాస్పద చట్టం 2019 డిసెంబరులో.. ఉభయ సభలతోపాటు, రాష్ట్రపతి ఆమోదం కూడా పొందిన సంగతి తెలిసిందే. అయితే, నిబంధనలు నోటిఫై చేయనందున ఇన్నాళ్లుగా అమల్లోకి రాలేదు. నిజానికి ఏదైనా చట్టం రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందాక ఆరునెలల లోపే దానికి సంబంధించిన నిబంధనలను రూపొందించి విడుదల చేయాలని పార్లమెంటరీ వర్క్ మాన్యువల్ చెబుతోంది.
అలా కాని పక్షంలో మరింత గడువు కావాలని సంబంధిత పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీని కోరాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే కేంద్ర హోం శాఖ 2020 నుంచి పొడిగింపులు కోరుతూ వస్తోంది. సోమవారం విడుదల చేసిన నిబంధనలు పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్‌లో మత మైనారిటీలుగా ఉన్నవారు భారత దేశ పౌరసత్వాన్ని పొందడానికి ఉపకరిస్తాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు.
ఆయా దేశాల్లో నివసించే హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రిస్టియన్లకు మన రాజ్యాంగ నిర్మాతలు చేసిన వాగ్దానాన్ని ప్రధాని మోదీ నెరవేర్చారని కొనియాడారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందే ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చి తీరుతామని ఆయన ఇటీవలికాలంలో పలు సందర్భాల్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఒక వర్గాన్ని ఏకీకృతం చేసేందుకే సరిగ్గా లోక్‌సభ ఎన్నికలకు ముందు మోదీ సర్కారు ఈ ఉత్తర్వులు జారీ చేసిందని కాంగ్రెస్ సహా పలు పార్టీలు మండిపడ్డాయి.