- ప్రమాదకరంగా మారిన ఏకశిలా జంక్షన్
- భయాందోళనలతో స్థానికులు, నగరవాసులు
- ప్రభుత్వం, అధికారులు దృష్టి పెట్టాలని గొర్రెకుంట ప్రజల విజ్ఞప్తి
వేద న్యూస్, వరంగల్:
ప్రభుత్వాలు మారుతున్నాయి..నాయకులు మారుతున్నారు..కానీ, ఆ సమస్య మాత్రం అలానే కొనసా..గుతోంది. ఎప్పటి చిప్ప ఎనుగులోనే అన్నట్టు సమస్యలను పరిష్కరించే నాథుడే కరువవుతున్నాడు. ఎన్నికల వేళ సమస్యలు తీరుస్తామంటూ ఇచ్చే హామీలు ఊకదంపుడు మాటలుగానే మిగిలిపోతున్నాయి. నాయకులు గెలిచాక కనీసంగా అటు వైపు చూడటం లేదని, తమ సమస్య పరిష్కరించడం లేదని గొర్రెకుంట ప్రాంతానికి చెందిన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రేటర్ వరంగల్ నగరం గొర్రెకుంట ప్రాంతంలోని ఏకశిలా జంక్షన్లో దాదాపుగా ప్రతి రోజూ ఒక రోడ్డు ప్రమాదం జరుగుతుండటం గ్రామస్తులను భయాందోళనకు గురిచేస్తోంది. అలా రోడ్ యాక్సిడెంట్స్ జరగడానికి ముఖ్య కారణం జంక్షన్ వెడల్పు లేకపోవడంతో పాటు ప్రమాద సూచికలు, స్పీడు బ్రేకర్లు లేకపోవడమేనని స్థానికులు ఆరోపిస్తున్నారు.
గత ఐదేండ్లలో సుమారు 30 మంది రోడ్డు ప్రమాదంలో బాధితులుగా ఉన్నారని వివరిస్తున్నారు. ఈ విషయమై పలుమార్లు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినా, మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా సమస్యలు పరిష్కరించడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు.
శనివారం ఉదయం సుమారు ఉదయం 6 గంటల ప్రాంతంలో గొర్రెకుంట ఏకశిలా జంక్షన్లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పారిశుధ్య కార్మికురాలు రోడ్డు ప్రమాదానికి గురై గాయపడ్డారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు ఏకశిలా జంక్షన్‌పై దృష్టి సారించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.