వేద న్యూస్, కమలాపూర్ :

=  స్పీడ్ బ్రేకర్ బోర్డు ఉన్నప్పటికీ గమనించని వాహనదారులు

= నిత్యం పదుల సంఖ్యలో వరుస ప్రమాదాలు

= ఆర్ అండ్ బి అధికారులు పరిష్కారం చూపాలని వాహనదారుల విజ్ఞప్తి..

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ వద్ద పరకాల – హుజురాబాద్  మెయిన్ రోడ్డు పై స్పీడ్ బ్రేకర్ ఉండడంతో దూరం నుంచి వచ్చే వాహనదారులు ఆ స్పీడ్ బ్రేకర్ ను గమనించకపోవడంతో నిత్యం పదుల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. స్థానికంగా ఉండే వారికి సబ్ స్టేషన్ వద్ద స్పీడ్ బ్రేకర్ ఉందనే విషయం తెలిసి నెమ్మదిగా వెళ్తున్నారు. కానీ దూర ప్రాంతాల నుంచి రోడ్డుపై వెళ్లే వాహనదారులు స్పీడ్ బ్రేకర్ ఉందనే విషయాన్ని  గమనించక పోవడంతో నిత్యం ప్రమాదాలు సంభవిస్తున్నాయి. నిన్నటి రోజున కూడా స్పీడ్ బ్రేకర్ కారణంగా ప్రమాదం జరిగి ఒక మహిళకు భుజం విరిగిపోయింది. ఈ రోడ్డుపై వాహనాల రద్దీ పెరగడంతో ప్రమాదాలు తరచుగా సంభవిస్తున్నాయి. అయితే ఈ స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయడానికి గల కారణం దాని దగ్గర మూలమలుపు ఉంది. గూడూరు గ్రామానికి వెళ్లే వాహనాలు ఈ మూలమలుపు వద్ద నుంచే వెళ్తుంటాయి. దూర ప్రాంతాల నుంచి వేగంగా వచ్చే వాహనదారులు అదే వేగంతో మూల మలుపు వద్ద కూడా వెళితే పెద్ద పెద్ద ప్రమాదాలు సంభవిస్తాయనే కారణంగానే స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా రోడ్డుపై స్పీడ్ బ్రేకర్ ఉందనే విషయం వాహనదారులకు తెలియపరచడానికి స్పీడ్ బ్రేకర్ ఫోటోతో కూడిన బోర్డును కూడా అధికారులు ఏర్పాటు చేశారు. కానీ ఆ స్పీడ్ బ్రేకరే ఇప్పుడు వాహనదారుల కు ప్రమాదకరంగా మారింది. ఈ విషయంపై ఆర్ అండ్ బి అధికారులు స్పందించి దీనికి పరిష్కారం చూపాలని వాహనదారులు కోరుతున్నారు.