•  సేవాకార్యక్రమాలతో జనంలోకి
  •  నిత్యం పలువురికి తోచినంత సాయం
  •  ఆపదలో అండగా ఉంటాననే భరోసా
  •  సామాజిక స్పృహతో ఆపన్నహస్తం అందిస్తున్న వెంకట్

వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి:

ఎవరైనా సరే ఎలా ఉండాలనుకుంటే..‘‘ఊరిచివరి మర్రిచెట్టులా ఉంటే మంచిది.. వేసవి కాలం వచ్చినపుడు నీడనిస్తుంది, వర్షాకాలం తడుస్తూ పరిగెడుతూ చెట్టు వద్దకు వస్తే చినుకులు పడకుండా కాపాడుతుంది. ఎప్పుడూ గుర్తించమని అడగదు.’’ అని ఓ సినీ దర్శకుడు పేర్కొన్న మాదిరిగా తన సేవలను విస్తృతంగా ప్రచారం చేయడం కంటే చేసిన మంచి మాత్రమే నిలవాలని, తాను కాదని భావించే వ్యక్తి ప్రముఖ సామాజిక వేత్త, జెన్‌ప్యాక్ట్ వైస్ ప్రెసిడెంట్ సబ్బని వెంకట్. మంచి మనసున్న వ్యక్తిగా..చేతికి ఎముక లేని దాతగా వెంకట్ ప్రసిద్ధి గాంచారు.

చేతికి ఎముక లేని దాత

హుజూరాబాద్ మండలం సిర్సపల్లి గ్రామానికి చెందిన సబ్బని వెంకట్ కష్టపడి చదువుకుని ప్రయోజకడయ్యారు. కుటుంబ స్థాయిని పెంచే విధంగా నడవడికను అలవర్చకున్నారు. ఉద్యోగంలో చేరిన తర్వాత క్రమశిక్షణ, పట్టుదలతో పని చేసి ఉన్నత స్థాయికి అంచెలంచెలుగా చేరుకున్నారు. పోటీ ప్రపంచంలోని నికరంగా నిలబడి మొన్నటి వరకు మల్టీ నేషనల్ కంపెనీ హెచ్‌సీఎల్ సీనియర్ డైరెక్టర్‌గా పని చేసిన వెంకట్..ఇటీవల జెన్‌ప్యాక్ట్ కంపెనీలో చేరి వైస్ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నారు. తాను ఎదగడమే కాదు తనతో పాటు పది మంది ఎదగాలని భావించే మనస్తత్వం ఉన్న వెంకట్.. ఎంతో మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ…అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ముందుంటున్నారు.

ఉద్యోగ, ఉపాధి కల్పనపైన ఫోకస్ చేయాలని సూచన
హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో జరగాల్సిన అభివృద్ధిపైన ప్రభుత్వాలు, నాయకులు సీరియస్‌గా ఫోకస్ చేయాలని సామాజికవేత్త సబ్బని వెంకట్ సూచిస్తు్న్నారు. ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేయవలసిన లీడర్లు కాలాన్ని అనవసరంగా వృథా చేస్తున్నారని, దీనివల్ల అభివృద్ధి అనే మాటకు విలువ లేకుండా పోతున్నదని పేర్కొన్నారు. గతేడాది కాలంగా హుజూరాబాద్ స్థితిగతులపై ప్రత్యక్షంగా, పరోక్షంగా దృష్టి సారించిన వెంకట్..హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఆపన్న హస్తం అందించేందుకు ముందు వరుసలో నిలబడుతున్నారు. రాజకీయంగా హుజురాబాద్ ప్రాంతం నుంచి ఎంతోమందికి అవకాశాలు లభించినప్పటికీ గత మూడు నాలుగు దశాబ్దాల నుండి హుజురాబాద్ ప్రాంతం సిద్దిపేట, సిరిసిల్ల ప్రాంతాలను దాటిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిర్మాణాత్మక సూచనలు
హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో డెవలప్‌మెంట్‌పైన నిర్మాణాత్మక సూచనలు చేస్తూ నియోజకవర్గ పరిధిలోని ప్రజల్లో కొత్త ఆలోచనను రేకెత్తిస్తూ..చర్చను లేవనెత్తే ప్రయత్నం చేస్తున్నారు. యువత, నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి కల్పనకు బలమైన అడుగులు పడితే బంగారు భవిష్యత్తు ఉంటుందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా, ఆ దిశగా డిస్కషన్ జరిగేలా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

యువతకు అండగా ఉంటూ.. ఆదర్శంగా నిలుస్తూ..
నిత్యం తన దృష్టికి వచ్చే సమస్యల పరిష్కారానికి తన వంతు తోడ్పాటును వెంకట్ అందిస్తున్నారు. రక్తదాన శిబిరాలతో యువతను రక్తదానం చేసేలా ప్రోత్సహించిన వెంకట్..నిత్యం ఎంతోమందికి సాయం చేస్తున్నారు. ఇవ్వడమే తప్ప అడగడం తెలియని వ్యక్తిగా ఉంటూ..యువతకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో ప్రజలకు విద్య, వైద్యం పరంగా తన వంతుగా సాయం అందిస్తున్నారు. అయితే, ప్రభుత్వం పరంగా చేయాల్సిన పనులపై నాయకులు మరింత దృష్టి సారించాలని, వైద్యవిద్యాసంస్థలు, పరిశ్రమలు నెలకొల్పాలని ప్రభుత్వాన్ని కోరాలని సూచిస్తున్నారు.

అగ్నిప్రమాద ఘటనపై గంటల వ్యవధిలో స్పందన
హుజూరాబాద్ పట్టణంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాద ఘటనపై వెంకట్ గంటల వ్యవధిలో స్పందించారు. బాధితులకు రూ.5 వేలు చొప్పున సాయం చేస్తానని ప్రకటించారు. నిజానికి వెంకట్ రాజకీయ నాయకుడు కాదు, ఆయనకు స్వచంద సంస్థలు లేవు, కాని ఎక్కడ బాధ, కష్టం ఉందని తెలిస్తే అక్కడికి సహాయం వెళ్తుందనే సంకేతాలను సబ్బని వెంకట్ పంపుతున్నారు.

వెంకట్ అగ్ని ప్రమాద ఘటన విషయమై చిరువ్యాపారులకు చేసిన పరిహారం ప్రకటన స్థానిక నాయకులను ఉలిక్కిపడేలా చేసిందనే చర్చ ఉంది. వారు సైతం పరిహారం ప్రకటించేలా తప్పని పరిస్థితిని వెంకట్ కల్పించారు. సామాజిక వేత్త సబ్బని వెంకట్ అందిస్తున్న సేవలను హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలు నిశితంగానే గమనిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. సబ్బని వెంకట్ తన సేవా దృక్పథంతో జిల్లావ్యాప్తంగా, హుజూరాబాద్ నియోజకవర్గవ్యాప్తంగా రాజకీయ వర్గాలు, ప్రజల్లో సరికొత్త చర్చ జరిగేలా ఓ నూతన ఒరవడికి తెరలేపారని పలువురు అభిప్రాయపడుతున్నారు.