కొవిడ్-19 మహమ్మారి వచ్చినప్పుడు ప్రపంచమంతా అతలాకుతలమైంది. జనం భయభ్రాంతులకు గురయ్యారు. మాస్కులు, లాక్‌డౌన్లు, వ్యాక్సిన్లు మొత్తంగా మన జీవనశైలినే కరోనా మార్చేసింది. దాదాపు రెండేండ్ల పాటు మనం అదే ధ్వనిలో జీవించాం, ఇప్పటికీ జీవిస్తున్నామని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కరోనాకు వ్యాక్సిన్ వచ్చినా ఆ భయం అయితే ప్రజల్లో ఉంది.
భారతదేశంలో కొవిడ్ వల్ల మరణించిన వారి సంఖ్య సుమారు 5 లక్షల ఉంది. కాగా, అదే సమయంలో ఓ మౌన హంతకుడు మన మధ్యలో నిశ్శబ్దంగా విలయతాండవం చేస్తున్నాడు ఆ మౌన హంతకుడే క్యాన్సర్.
క్యాన్సర్ బారిన పడి ఏటా కోటి మంది మృతి
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది సుమారు 1.0 కోట్ల మంది క్యాన్సర్‌తో మరణిస్తున్నారు. భారత్‌లో 2022లో 9.1 లక్షల మంది క్యాన్సర్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇది కొవిడ్ వల్ల మరణించిన వారి సంఖ్య కంటే రెండు రెట్లు ఎక్కువ కాగా, ఏటా సుమారు 1.5 మిలియన్ల కొత్త కేసులు నమోదవుతున్నాయి. అయినా మనం భయపడట్లేదు.
కొవిడ్ మాదిరిగానే క్యాన్సర్‌పై దృష్టి పెట్టాలి
క్యాన్సర్ అనేది ఒక్కసారిగా బయటపడే వ్యాధి కాదు. ఇది శరీరాన్ని మెల్లగా కొల్లగొడుతుంది. తొలినాళ్లలో లక్షణాలు లేనట్టు ఉండటం వల్ల చాలామంది ఆలస్యంగా గుర్తిస్తారు. కానీ, అప్పటికి వ్యాధి తీవ్రస్థాయిలో ఉంటుంది. మనం కరోనాపై ఎంత సంరక్షణతో ఉన్నామో, అదే దృష్టిని కేన్సర్‌పై చూపించాల్సిన అవసరం ఉంది.
దేశంలో ప్రతి 8 మందిలో ఒకరు క్యాన్సర్ బారిన పడే చాన్స్
భారతదేశంలో ప్రతి 8 మందిలో ఒకరు జీవితకాలంలో క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. మహిళల్లో అత్యధికంగా ప్రమాదకరమైన బ్రెస్ట్ కేన్సర్, పురుషుల్లో ఓరల్ కేన్సర్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. తుమ్ము వచ్చిందని కరోనా టెస్ట్‌కు పరుగెత్తిన మనం, రక్తస్రావం వచ్చినా ఇంకేదైనా అనారోగ్యం బారిన పడినా పరీక్ష చేయించుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు.
ముందస్తు జాగ్రత్తలతో ముప్పు తగ్గుముఖం
మధుమేహం, అధిక బరువు, పొగతాగటం, మద్యపానం వంటి జీవనశైలి కారణాలే కేన్సర్‌కు గల ప్రధాన కారణాలు. వ్యాధి ప్రాథమిక దశల్లో గుర్తిస్తే చికిత్సకు అవకాశాలు మెరుగవుతాయి. ప్రభుత్వం వినియోగిస్తున్న స్క్రీనింగ్ కార్యక్రమాలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది.
ప్రజల్లో క్యాన్సర్‌పై అవగాహనలేమి..
క్యాన్సర్‌పై ప్రజలలో అవగాహన కొరవడటం, సమయానికి పరీక్షలు చేయించకపోవడం, ప్రభుత్వ-ప్రైవేటు ఆసుపత్రుల మధ్య సమన్వయ లోపం.. ఇవన్నీ కలిసి కేన్సర్‌ను మరింత ప్రాణాంతకంగా మారుస్తున్నాయి. ఇది ఏ ఒక్కరిపై నెట్టివేయలేని బాధ్యత. ఇది వ్యక్తిగతం, కుటుంబీకం, సమాజం అందరికీ సంబంధించిన విషయమే.
నిద్రలేచే సమయం ఆసన్నం
కొవిడ్‌కు వ్యాక్సిన్ వచ్చింది. కానీ, క్యాన్సర్‌కు రాలేదు. దాని(క్యాన్సర్) నుంచి మనల్ని రక్షించేది జాగ్రత్తే. ప్రతి ఏడాది ఒకసారి స్క్రీనింగ్, ఆరోగ్యపరంగా జీవనశైలి, సరైన ఆహారం, వ్యాయామం – ఇవే మన అసలైన ఆయుధాలు. క్యాన్సర్ అంటే చావు కాదు. ఆలస్యం చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రమాదం. ఇప్పుడు నిద్రలేచే సమయం వచ్చింది. ప్రజలందరూ అప్రమత్తమై జాగ్రత్త వహించడం మంచిది.
– డాక్టర్ రాచమల్ల అరుణ్,
సెల్:99125 16604.