పీవోపీ విగ్రహాలు వద్దు 

భారతీయులందరూ జరుపుకునే సామూహిక ప్రకృతి పండుగ వినాయక చవితి. ప్రకృతిలో గణనాథుని పూజించే పర్వదినం. గణేశ్ చతుర్థి ఆవిర్భావానికి స్వాతంత్రోద్యమ నాయకులు బాలగంగాధర తిలక్ కారణం. గణేష్ మంటపాల ఏర్పాటుకూ, సమాజాన్ని దేవుడు పేరు మీద కూడగట్టి స్వతంత్ర పోరాటంలో పాల్గొనేట్లు చైతన్యం చేయడానికీ ఆయనే కారణం. అంతకు ముందు వినాయకుడి విగ్రహాలను ఇళ్లల్లో పెట్టి, పూజలు చేశాక ఇంట్లో బావిలో, దగ్గరలో కుంటల్లో, చెరువుల్లో వేసేవారు. కాగా, జాతిని జాగృతం చేసే క్రమంలో ఒక ధార్మిక వేదికను తిలక్ ఏర్పాటు చేయడం వల్ల అప్పుడు భారతీయులను ఏకతాటిపైకి తీసుకు రావడం , తద్వారా సంఘటిత శక్తి‌గా రూపాంతరం చెంది బ్రిటిష్ ఆగడాలను తిప్పికొట్టగలిగాం. అది చరిత్ర..1894లో మహారాష్ట్రలోని పుణె కేంద్రంగా సార్వజనిక్‌ గణేశ్‌ ఉత్సవ్‌ పేరిట గణేశ్ ఉత్సవాలకు నాంది పలికింది. అప్పటి నుంచి గణపతి ఉత్సవాలను సామాజిక వేదికలుగా చేసి సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం ప్రారంభించారు. ప్రజల నుంచి విశేష స్పంద‌న రావడం, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే భక్తులను ఆంగ్లేయులు నిర్బంధించలేకపోవడంతో వినాయకుని సాక్షిగా స్వాతంత్ర్య ఉద్యమం ఊపందుకుంది. పూజాకార్యక్రమాలు, ఆ త‌ర్వాత జాతీయోద్యమానికి సంబంధించిన పాటలు, ఉపన్యాసాలు ఈ నవరాత్రుల్లో ఉండేలా ప్రణాళిక సిద్ధం చేశారు తిలక్‌. జాతీయోద్యమ నాయకులకు కూడా ప్రజల్ని చైతన్య వంతులను చేయటానికి ఈ మండపాలు మంచి వేదికగా నిలిచాయి. తర్వాత సంవత్సరం నుంచి ఈ ఉత్సవాలు ఏ ఒక్కచోటకు మాతమ్రే పరిమితం కాకుండా యావత్‌ భారతావనికి పాకాయి. కులమతాలకు అతీతంగా ఏకం అయి ఈ కార్యక్రమాలకు ప్రజలు పెద్దఎత్తున పాల్గొనేవారు.

పీవోపీతో జీవవైవిధ్యానికి హాని..

1908లో తిలక్‌ జైల్లో ఉన్నప్పుడు ఈ ఉత్సవాలను కట్టడి చేయటానికి బ్రిటిష్‌ ప్రభుత్వం చాలా ప్రయత్నించింది. మేళాలు, భజనలు, కీర్తనలు, ప్రసంగాలపై నిర్బంధం విధించింది. కానీ, అవేమీ పనిచేయలేదు. అప్పటికే భారతీయ ఐక్యతకు ప్రతీకగా రూపాంతరం చెందింది గణేశ్‌ ఉత్సవం. గణేశ్ ఉత్సవాలను నిర్వహించుకోవడం మంచిదే. కానీ, అందుకు పీవోపీ(ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్) విగ్రహాలు వాడటం పట్ల పర్యావరణవేత్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పీవోపీ నీటిలో కరగదు. అలాగే, విగ్రహాలను తయారు చేయడానికి ఉపయోగించే ఆయిల్ పెయింట్‌లు, వీటిలో అత్యంత విషపూరిత రసాయనాలు, నీటి కాలుష్యానికి కారణమయ్యే భారీ లోహాలు ఉంటాయి. ఈ విగ్రహాలలో కలిపే రసాయనాలు ముఖ్యంగా క్యాడ్మియం (Cd) క్రోమియం (Cr) సీసం (Pb) మెర్క్యూరీ (Hg) ఫ్లోరోసెంట్ మొదలగునవి చాలా ప్రమాదకరమైనవి. వీటి వాడకం వల్ల పర్యావరణానికి ముఖ్యంగా జల జీవావరణ వ్యవస్థలకు ప్రమాదం. ఇవి నీటిలో సాధారణంగా కొన్ని వందల సంవత్సరాల వరకు కరగదు. కాబట్టి రసాయనాల అవశేషాలు నీటి అడుగున చేరి భూగర్భ జలాన్ని సైతం కలుషితం చేసి జలావరణ వ్యవస్థను విషపూరితం చేస్తాయి. ముఖ్యంగా మానవుడు జంతువుల తాగు నీటిలో కరిగి అనేక అనారోగ్య సమస్యలను తలెత్తి ప్రమాద కారకం అవుతాయి. పీవోపీ రసాయన రంగుల పెద్ద పెద్ద విగ్రహాలు ప్రతిష్టించి నీటి వనరులను కాలుష్యం చేయడమే కాక విలువైన మత్స్య సంపదను మట్టు పెడుతున్నారు. రసాయనాలు భూగర్భ జలాలను కూడా కలుషితం చేసి ప్రజా రోగ్య వ్యవస్థ కు ప్రమాదం కల్పిస్తున్నారు. దీనిని నియంత్రించే అధికార వ్యవస్థ ఉండాలి. అందుకు డివిజన్ కు ఒకటి లేదా రెండు మండపాలు మాత్రమే అనుమతించాలి. డీజేల బదులు చిన్న మైక్ లు అనుమతించాలి. మట్టి వినాయకుని ప్రతిమ లు, రసాయన పెయింట్ రహిత విగ్రహాలు మాత్రమే ప్రతిష్టించాలని స్ట్రిక్ట్ ఆర్డర్ ఇవ్వాలి. నిమజ్జనం కోసం కృత్రిమ నీటి కుంటలను ఏర్పాటు చేయాలి. ఇప్పటికే ప్రభుత్వాలు పలు చోట్ల కృత్రిమ నీటి కుంటలు ఏర్పాటు చేస్తు్న్నాయి. కానీ, అనుకున్న స్థాయిలో జరగడం లేదు. పైన చేసిన ఈ సూచనలను ప్రభుత్వం కచ్చితంగా అమలు చేసే దిశగా ఆలోచన చేయాలి. భూ కాలుష్యం, నీటి కాలుష్యం,శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం మొదలగునవి ఈ వినాయక చవితి (గణేష్ నిమజ్జనం) పండుగ ద్వారా జరగడం సరికాదు అనేది పర్యావరణ వేత్తల అభిప్రాయం. పర్యావరణం మనందరిది. దానిని మనమే కాపాడుకోవాలి. పర్యావరణహితమైన మట్టి వినాయకులనే పూజిద్దాం. పర్యావరణ సమతుల్యతను కాపాడుకుందాం. దయచేసి మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్టించి పూజించండి. మట్టి విగ్రహాల ప్రతిష్టాపనకే చందాలు ఇవ్వండి. లేదంటే ఇవ్వకండి. మార్పు అనేది మన నుండే మొదలు కావాలి పర్యావరణాన్ని మనమే రక్షించుకోవాలి. పర్యావరణహితమైన మట్టి వినాయకులనే పూజిద్దాం పర్యావరణ సమతుల్యతను కాపాడుకుందాం. ‘‘పర్యావరణ రక్షణకు ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని సహకరించండి.’’

 

రవిబాబు పిట్టల, 

పర్యావరణవేత్త, హైదరాబాద్.

 

2 thought on “మట్టి గణేశుడే ముద్దు ”
  1. Veda News Serving in education of of a real feelings of people and real news to the public local national and international. Thank you Editor.

    Ravi Babu Pittala, Environmentalist, JNTUH Hyderabad

Comments are closed.