• సహకరించిన 28 మంది కౌన్సిలర్లకు ధన్యవాదాలు
  •  హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

వేద న్యూస్, జమ్మికుంట:
జమ్మికుంట మున్సిపాలిటీలో అవిశ్వాసం వీగిపోయిందని, జమ్మికుంట మున్సిపాలిటీ పై మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగిరిందని హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. గురువారం జమ్మికుంట లోని మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు ఇంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ తెలంగాణ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చేసి దేశంలోనే నెంబర్ వన్ చేశారని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు కళ్యాణ లక్ష్మి రైతు బీమా దళిత బంధు లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన గొప్ప నాయకుడు అని తెలిపారు. భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని మునిసిపాలిటీలకు అభివృద్ధిలో భాగంగా అనేక బహుమతులు కూడా వచ్చేలా కెసిఆర్ కృషి చేశారని పేర్కొన్నారు. గ్రామపంచాయతీల అభివృద్ధి విషయంలో కూడా దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని పేర్కొన్నారు. జమ్మికుంట మున్సిపాలిటీలో అవిశ్వాసానికి కూడా ఒకరిద్దరూ కారణమయ్యారని, అయినప్పటికీ కౌన్సిలర్లంతా ఏకతాటిపై ఉండి అవిశ్వాసం వీగేలా చేశారని వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మరోసారి జమ్మికుంట మున్సిపాలిటీపై జెండా ఎగురవేసేందుకు గర్వంగా ఉందని వెల్లడించారు. అవిశ్వాసం వీగడానికి సహకరించిన 28 మంది కౌన్సిలర్లకు తాను ఎప్పటికీ అండగా ఉంటానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులు ఇలాంటి కార్యక్రమాలు మానుకొని ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీల హామీలను నెరవేర్చడం కోసం దృష్టి సారించాలని సూచించారు.

హుజురాబాద్ నియోజకవర్గం లోని ప్రజలంతా ఈ నెల నుంచి కరెంట్ బిల్లు కట్టవద్దని సూచించారు. 200 యూనిట్ల లోపు ఉన్న వారెవరు కరెంట్ బిల్లు కట్టడం అవసరం లేదని ముఖ్యమంత్రి తో పాటు వారి మంత్రి కూడా స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. ఎవరైనా కరెంటు బిల్లు కట్టాల్సిందేనని వేధిస్తే వారికి ముఖ్యమంత్రితోపాటు మంత్రి చెప్పిన వీడియోను చూపించాలని అన్నారు.

ఎన్నికల సందర్భంగా డిసెంబర్ 9 తేదీని రెండు లక్షల రుణమాఫీ చేస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, రైతులంతా రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారని వెంటనే రుణమాఫీ చేయాలని గుర్తు చేశారు. కాంగ్రెస్ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని కెసిఆర్ ని ప్రజల నుంచి దూరం చేయాలని పిచ్చి ఆలోచనలతో..
కరీంనగర్ లో బిఆర్ఎస్ హయాంలో అద్భుతమైన ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కట్టారని దానికి కరీంనగర్ సర్కిల్ రెస్ట్ హౌస్ అని పేరు పెడితే దాన్ని తొలగించి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ గా మార్చారని అన్నారు.

గతంలో కూడా సచివాలయంలో కేసీఆర్ పేరుతో ఉన్న బోర్డుపై బురద రాశారని తెలిపారు. కేసీఆర్ పేరును బోర్డులు, గోడల మీద నుంచి తొలగించినంత మాత్రాన ప్రజల గుండెలో నుంచి తొలగించలేరని వివరించారు. రైతులు రైతుబంధు ఇంకా పడలేదని తమ ఆవేదన వ్యక్తం చేస్తుంటే బాధ్యత కలిగిన హోదాలో ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రైతులను చెప్పుతో కొడతనని అనడం బాధాకరమని అన్నారు.

ఎంతోమంది రైతులు ఓటు వేస్తేనే తాను గెలిచిన విషయం మరిచిపోవద్దని గుర్తు చేశారు. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో తగిన గుణపాఠం ప్రజలు చెప్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో ఇల్లంతకుంట ఎంపీపీ పావని వెంకటేష్, వీణవంక ఎంపీపీ రేణుక తిరుపతిరెడ్డి, జమ్మికుంట టౌన్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ టంగుటూరి రాజ్ కుమార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పోలినేని సత్యనారాయణ రావులతో పాటు గులాబీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.