వేద న్యూస్, ఫీచర్స్/అంబీరు శ్రీకాంత్:

భూమ్మీద మానవాళి కంటే ముందే ఎన్నో వన్యప్రాణుల మనుగడ ఉంది. పర్యావరణ సమతుల్యతలో వాటి పాత్ర కీలకం. కాగా, కాలక్రమంలో మానవ చర్యల వల్ల అడవులు తగ్గిపోతున్నాయి. ఫలితంగా వాతావరణ పరిస్థితులలో మార్పులు సంభవిస్తున్నాయి. వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో వన్యప్రాణుల సంరక్షణకు ప్రభుత్వాలు మరింత పకడ్బందీగా కృషి చేయాలని వన్యప్రాణి ప్రేమికులు, పర్యావరణవేత్తలు కోరుతున్నారు.

ఇక వన్యప్రాణుల విషయానికొస్తే..అడవిలో ఉన్న జంతువులన్నింటిలో ‘‘పులి’’ డిఫరెంట్ యానిమల్ అని పర్యావరణ ప్రేమికులు చెప్తుంటారు. టైగర్ లైఫ్ స్టైల్ ప్లస్ దానికి సంబంధించిన ఇతర విషయాలు తెలుసుకునేందుకు జనం బాగా ఆసక్తి చూపిస్తుంటారు.సింహం, ఏనుగు వంటి ఇతర జంతువులు సైతం అందరికీ దాదాపుగా ఇష్టమైన జంతువులుగా ఉంటాయి. అయితే, చాలా మందికి మోస్ట్ ఫేవరెట్ యానిమల్ ‘‘పులి’’నే అనేది కొందరి అభిప్రాయం. అయితే, అసలు పులి ఎలాంటి సందర్భంలో దాడి చేస్తుంది? అడవి దాటి ఎప్పుడు బయటకు వస్తుంది? పులికి ఉన్న అరుదైన లక్షణాలు ఏంటి? ఒక ఆడ పులి తన జీవిత కాలంలో ఎన్ని పులులకు జన్మనిస్తుంది? వంటి ఆసక్తికర విశేషాలపై ‘వేద న్యూస్’ స్పెషల్ ఫోకస్ స్టోరీ మీ కోసం..

మనిషి కంటే కొన్ని వందల ఏండ్ల కిందటే భూమ్మీదకు వచ్చిన వన్యప్రాణుల్లో ఒకటి ‘‘పులి(Tiger)’’. ప్రపంచంలో ఉన్న పులులల్లో మూడో వంతు భారతదేశంలోనే ఉండటం విశేషం. భారతదేశ జాతీయ జంతువు కూడా ‘‘పులి’’యే. 2023 వరకు ఉన్న అధికారిక లెక్కల అంచనా ప్రకారం భారతదేశంలో 3,160 పులులు ఉన్నట్లు తెలుస్తోంది. పులిని జనరల్ గా క్రూర జంతువుగా అభివర్ణిస్తారు. కానీ, పులి సాధు జంతువునేనని పర్యావరణ ప్రేమికులు, నిపుణులు వివరిస్తున్నారు. ఆత్మరక్షణ కోసం మాత్రమే పులి దాడి చేస్తోందని, ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే పులి ప్రవర్తన సాధారణం కంటే భిన్నంగా ఉంటుందని పేర్కొంటున్నారు. పర్యావరణ సమతుల్యానికి జీవగర్ర ‘‘పులి’’. ఈ నేపథ్యంలో పులి సంరక్షణకు ప్రభుత్వాలు ప్రాధాన్యతను ఇస్తున్నాయి. తద్వారా పర్యావరణ పరిరక్షణకు అడుగులు పడుతున్నాయి.

పులి ఆహారచక్రంలో రెండు కాళ్ల మానవుడు లేడని చెప్తున్నారు పర్యావరణ నిపుణులు. నాలుగు కాళ్ల జంతువును మాత్రమే పులి దాడి చేస్తుందని స్పష్టం చేస్తున్నారు. పులి పంజా చాలా పవర్ ఫుల్ అని వివరిస్తున్నారు. ఒకసారి పులి పంజా విసిరితే దాని బలం ఒకటిన్నర టన్నుల వరకు ఉంటుందని అంచనా. అంతటి శక్తిమంతమైన పులి పంజాకు ఎదుటి జంతువు ఏదైనా చీలిపోవాల్సిందేనట.

పులి దాని ఆహార లభ్యతను బట్టి సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటుంది. తను నిర్మించిన సామ్రాజ్యపు కోటగా భావించి సదరు పులి (ఆడ లేదా మగ) తన యూరిన్(మూత్రం) ద్వారా చెట్లకు స్ప్రే చేసి టెరిటరీని కంట్రోల్ లో ఉంచుకుంటుంది.

ఒకవేళ ఇతర పులి ఏదైనా తన సామ్రాజ్యంలోకి ఎంటరైతే సదరు పులితో భీకర ఫైట్ జరుగుతోందట. ఇక ఆ యుద్ధంలో ఎవరు గెలిస్తే వారిదే ఆ సామ్రాజ్యం అన్నట్లుగా పులులు భావిస్తాయి. ఇక అడవులలో ఆహార లభ్యత, పులుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో పులులు అడవి దాటి బయటకు కూడా వస్తున్నట్లు స్వచ్ఛంద పరిశోధక సంస్థలు గుర్తిస్తున్నాయి.

సింహంతో పోలిస్తే పులియే రాజసంగా ఉంటుందనేది కొందరి అభిప్రాయం. ఎందుకంటే సింహాల్లో మగ సింహానికి ఉండే జూలు, జుట్టు, నడుము అందంగా కనిపిస్తాయి. అయితే, పులి మాత్రం ఆడ లేదా మగ ఏదైనా కానీ, ఆ నడకలోనే రాజసం ఠీవీ కొట్టిచ్చినట్లు కనబడుతాయని చెప్తుంటారు. అందుకే జూలలో సైతం సందర్శకులు, జనం ఎక్కువ సేపు పులి ఉండే ప్రదేశంలో పులిని చూస్తుంటారు అని చెప్పొచ్చు.

పులి కొమ్ములన్న జంతువులపైన దాడి చేయడానికి జంకుతుందట. ముఖ్యంగా ఎలుగుబంటిపైన దాడి చేయాలంటే కూడా పులి భయపడుతుంది. ఎందుకంటే ఎలుగుబంటి తన గోర్లతో పులి నాక్కోలేని ప్రదేశంలో గాయం చేస్తుంది. ఫలితంగా అది ఇన్ ఫెక్షన్ అయి, పులి ప్రాణానికే ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే పులి జనరల్ గా ఎలుగుబంటిపైన దాడి చేయాలంటే చాలా జాగరుకతతో వ్యవహరిస్తుందని పర్యావరణ నిపుణులు వివరిస్తున్నారు. ఆడ పులి తన ఆయుర్దయ కాలంలో 24 పులులకు జన్మనిస్తుంది. అందుకే ఆడ పులి సంరక్షణను అటవీ అధికారులు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా భావిస్తారని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.

పులులలో రకాలు చాలా ఉన్నాయి. అవి చాలా మందికి తెలిసి ఉండబోవు. పులి, పిల్లి ఒక్కటేనని..ఇవన్నీ క్యాట్ ఫ్యామిలీనేనని పరిశోధకులు చెబుతున్నారు. పులిలో రకాలు పెద్దపులి, చీతా(భారతదేశంలో ఇవి అంతరించిపోయాయి), లెపార్డ్ క్యాట్(ఆకు చిరుత), ప్యూమాలు, ఫిషింగ్ క్యాట్, రస్టిక్ క్యాట్, వైల్డ్ క్యాట్, బ్లాక్ పాంతర్లు. ఇలా పులులలో పలు రకాలున్నాయి.

పెద్దపులి విషయానికొస్తే..ఇది చెట్లు ఎక్కలేదు. కానీ, పెద్దపులి చాలా దూరం జంప్ చేయగలదు. అలా అది మాటు వేసి మాత్రమే తన వేటను కొనసాగిస్తుంది. పులి సంభోగ సమయంలో ప్రత్యేక లక్షణాలను కలిగి ఉండటం విశేషం. ప్రతీ సంవత్సరం జూలై1 నుంచి సెప్టెంబర్ 30 వరకు 3 నెలల పాటు పులుల సంభోగానికి సమయం అని పర్యావరణ పరిశోధకులు, పర్యావరణ వేత్తలు చెప్తు్న్నారు.

పులి మనిషి కానీ ఇతర ఏదైనా అలికిడి వింటే సంభోగానికి అసలు సిద్ధపడదు. ఆడ పులి అనుమతితో మాత్రమే మగ పులి సంభోగానికి సిద్ధమైతుంది. పులి సాధారణంగా ఏదైనా జంతువుపైన దాడి చేస్తే వెంటనే ఆ జంతువును తినదట. మొదలు మొత్తటి పదార్థాలను భుజిస్తుంది. ఆ తర్వాత ఒక రెండ్రోజులు ఆగి వచ్చి మిగతా పదార్థాలను తింటుంది. ఒకసారి పులి దాదాపు 40 కిలోల మాంసాన్ని తింటుందని అంచనా. మధ్యప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో ఉన్నట్లు అధికారిక లెక్కల అంచనా. ప్రతీ పులికి యూనిక్ చారలు ఉండటం ప్రత్యేకత. ఆ చారలను బట్టి పులుల గణన చేపడుతారని అధికారులు వివరిస్తున్నారు.