ఈ ప్రపంచాన్ని నడిపించేది సూర్య భగవానుడు అయితే, ఆ సూర్యుని నుంచి వచ్చే
శక్తి(సూర్యరశ్మి)ని నమ్ముకుని భూమండలంలోని ప్రజల ఆకలి బాధను తీర్చే మరో
దేవుడు ‘అన్నదాత’. నేల తల్లిని నమ్ముకుని, ప్రతికూల పరిస్థితులకు
ఎదురొడ్డి, ఆరుగాలం శ్రమించి దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర
పోషిస్తున్నారు వ్యవసాయదారులు. ఆ అన్నదాత దినోత్సవం ఈ రోజు. రైతు కుటుంబం
నుంచి వచ్చి ప్రధాని పదవిని అలంకరించిన చరణ్ సింగ్ పుట్టిన రోజును దేశం
రైతు దినోత్సవంగా నిర్వహించుకుంటున్నది. భారత మాజీ ప్రధాని చౌదరీ చరణ్
సింగ్ జన్మదినం డిసెంబర్ 23ను భారత్‌లో అత్యంత వైభవంగా జాతీయ రైతు
దినోత్సవం (కిసాన్ దివస్)గా జరుపుకుంటున్నాం. చౌదరి చరణ్ సింగ్ చేపట్టిన
ఉద్యమాల ఫలితంగానే జమీందారి చట్టం రద్దు అయింది. రైతు నాయకుడిగానే దేశ
రాజకీయాల్లో చరణ్ సింగ్ గుర్తింపు పొందారు. రైతుల కోసం చరణ్ సింగ్ చేసిన
ఆలోచనల ఫలితంగా రైతులకు రుణాలు అందించే విధానం ప్రవేశపెట్టారు. రైతులకు
ఆయన చేసిన విశేష సేవలకు గుర్తుగా ప్రభుత్వం చరణ్ జన్మదినోత్సవాన్ని
‘కిసాన్ దివస్’గా ప్రకటించింది.

పవిత్ర వృత్తి వ్యవసాయం..
‘దేశానికి వెన్నెముక.. రైతు’, ‘దేశానికి పట్టెడన్నం పెట్టే దేవుడు రైతు’
అని ప్రతీ ఒక్కరు నినదిస్తుంటారు. దేశాన్ని రక్షించే జవానుకు ఎంత
గౌరవముందో, రైతులకూ అంతే ప్రాముఖ్యత ఉంది. ఈ క్రమంలోనే ‘జై జవాన్..జై
కిసాన్’ నినాదం వచ్చింది. అయితే, రైతు నేడు ఏకాకి అయ్యాడు. విత్తనాలు,
ఎరువుల కొరత, మార్కెట్ మాయాజాలంతో కర్షకుడు సతమతమవుతున్నాడు. ముఖ్యంగా
పెట్టుబడి విషయంలో రైతు ఇబ్బంది పడుతున్నాడు.

సరైన సమయంలో రుణమాఫీ కాక దిక్కుతోచని స్థితిలో కొందరు రైతులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ‘పంట పండినా/ రైతుకు చిప్పే చేతికి/ మద్దతు ధరంతా దళారీ నోటికి’ అన్న కవి
మాయకుంట్ల నారాయణరెడ్డి మాటలు మన కండ్ల ముందు జరుగుతున్న వాస్తవమే.
ఎన్నో కష్టాలకు ఓర్చి పంట పండించుకున్నప్పటికీ మార్కెట్‌లో దళారులు రైతు
శ్రమను చౌక చేస్తున్నారు. వారు ఆర్థికంగా బలపడుతున్నారే తప్ప రైతు
పరిస్థితి క్షేత్రస్థాయిలో మారడం లేదు. దళారీ వ్యవస్థను వ్యవస్థను
అరికట్టడం ద్వారానే రైతు రాజుగా మారుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక
ప్రభుత్వాలు సైతం అన్నదాత గోడు ఆలకించి వెంటనే స్పందించాలి. కర్షకుల
ఆత్మహత్యల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. కష్టాల సాగుబాటలో
పయనించి కడగండ్లు మిగిలినా రైతన్నలు బతికి సాధించే విధంగా వారికి
ప్రభుత్వాలు సరైన ప్రోత్సాహాలు అందించాలి.

ఇతర రంగాలకు ఇచ్చే ప్రాధాన్యత కంటే వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి.

ప్రపంచ ఆర్థిక ప్రగతిలో వ్యవసాయ అభివృద్ధి కీలకమైన అంశమని గుర్తించాలి. సమాజం సైతం
వ్యవసాయం పట్ల చిన్నచూపు చూసే పరిస్థితి ఇటీవల కాలంలో ఏర్పడింది. తాము
వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ వ్యవసాయం చేసే యువకులకు పెండ్లిళ్లు
కాని పరిస్థితులు మనం చూడొచ్చు. అందుకు ప్రధాన కారణం వ్యవసాయం దండగ అనే
అభిప్రాయం కావచ్చు. కానీ, 10 వేల ఏండ్లుగా పురాతన వృత్తిగా ఉన్న వ్యవసాయం
వల్లే మానవాళి బతుకు ఉందని వారు గ్రహించాలి. యువత సైతం వ్యవసాయాన్ని
పవిత్ర వృత్తిగా భావించి సంప్రదాయ పద్ధతులకు ఆధునికతను జోడించి
వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కించాలి. అందుకు ప్రభుత్వం రైతులకు సకల
సౌకర్యాలు అందించాలి. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులను ప్రభుత్వం పెద్ద
మనసుతో ఆదుకోవాలి.

నేడు(డిసెంబర్ 23) జాతీయ రైతు దినోత్సవం
– అంబీరు శ్రీకాంత్, జర్నలిస్టు,
Email:ambeerisrikanth@gmail.com