వేద న్యూస్, హైదరాబాద్/ ముషీరా బాద్:

గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటీవ్ హౌసింగ్ సొసైటీ సర్వసభ్య సమావేశం ఈనెల 27వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకు చిక్కడపల్లి లోని త్యాగరాయ గానసభలో జరుగుతుందని సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య, కార్యదర్శి బొల్లం శ్రీనివాస్ తెలిపారు.

ఈ సమావేశానికి రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని, టీ జేఏసీ నాయకులు ప్రొఫెసర్ కోదండరాం, రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీస్ అధికారులు పాల్గొంటారని తెలిపారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వివిధ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో పని చేస్తున్న దాదాపు వెయ్యిమంది జర్నలిస్టులు సొసైటీలో సభ్యులుగా ఉన్నారని, 2008 లో ఏర్పడిన ఈ సొసైటీలో ఎంతో మంది సీనియర్ జర్నలిస్టులు సభ్యత్వం పొంది గత పదిహేను సంవత్సరాలుగా ఇళ్ళస్థలాల కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇళ్ళస్థలాల కోసం పలు మార్లు ప్రభుత్వాన్ని కోరినప్పటికీ సొసైటీ సభ్యులైన జర్నలిస్టులకు ఇళ్ళస్థలాలు ఇవ్వకుండా తీవ్ర జాప్యం చేసిందని ఆరోపించారు.

తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన జర్నలిస్టులను కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, తెలంగాణ ఉద్యమానికి, ప్రత్యేక రాష్ట్ర సాధనకు జర్నలిస్టులను వాడుకున్న కేసీఆర్… అధికారంలోకి వచ్చిన తర్వాత పదేళ్ళుగా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.

ప్రస్తుతం ప్రజా పాలన లక్ష్యంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయినా జర్నలిస్టులకు న్యాయం చేయాలని,తమ గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీకి స్థలం కేటాయించి అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ళస్థలాలిచ్చి ఆదుకోవాలని కోరారు. ఈనెల 27న జరిగే సొసైటీ సర్వసభ్య సమావేశానికి సొసైటీ సభ్యులందరూ హాజరు కావాలని వారు విజ్ఞప్తి చేశారు.

జర్నలిస్టుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు.