- ముందుగా గుర్తింపు, చికిత్సతో ప్రమాద నివారణ
వేద న్యూస్, జమ్మికుంట:
అధిక రక్తపోటు అవయవాలకు చేటు అని వైద్యులు చెబుతున్నారు. ముందుగా గుర్తిస్తే వైద్యులను సంప్రదిస్తే, ప్రమాదం నుంచి బయట పడొచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మే 17 ను ప్రపంచ హైపర్ టెన్షన్ దినోత్సవం సందర్భంగా ‘వేద న్యూస్’ తెలుగు దినపత్రిక పాఠకుల కోసం సంజీవని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యుడు, ఎండీ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఊడుగుల సురేశ్ హైపర్ టెన్షన్ గురించి వివరించారు. ఆ విషయాలు..
హైపర్ టెన్షన్ అంటే ఏమిటి..?
రక్తనాళాల్లో రక్తం వేగంగా ప్రవహించి, అధిక ఒత్తిడి పెరగడం వల్ల వచ్చే సమస్యే హై బీపీ. సాధారణంగా 140/90 ఎంఎంహెచి లేదా అంతకంటే ఎక్కువ బీపీ ఉంటే హైపర్ టెన్షన్‌గా పరిగణిస్తారు. 140/90 ఎంఎంహెచీ ఉంటే తేలికపాటి హైపర్ టెన్షన్, రీడింగ్ 140/90 నుంచి 159/99 ఎంఎంహెచ్కి మధ్య ఉంటే స్టేజ్-1 హైపర్ టెన్షన్, రీడింగ్ 160/100 ఎంఎంహెచ్ జీ కంటే ఎక్కువైతే స్టేజ్ -2 హైపర్ టెన్షన్, 180/110 ఎంఎంహెచ్లో కంటే ఎక్కువైతే, హైపర్ టెన్సివ్ ఎర్జెన్సీ అంటారు. ఇది అత్యవసరంగా చికిత్స అవసరం చేసే స్థితి.
హైపర్ టెన్షన్ రెండు రకాలు
సాధారణంగా హైపర్ టెన్షన్ ను రెండు రకాలు వర్గీకరిస్తారు. ఇందులో మొదటిది ప్రైమరీ హైపర్ టెన్షన్. ఇది వయస్సు పెరగడం, జీవనశైలి, అలవాట్లు (అనారోగ్యకరమైన ఆహారం, వ్యాయామం లోపం, ఒత్తిడి) వల్ల క్రమంగా అభివద్ధి చెందుతుంది. రెండో ది సెకండరీ హైపర్ టెన్షన్. ఇది మూత్రపిండాల వ్యాధులు, హార్మోన్ వ్యత్యాసాలు, కొన్ని మందుల వాడకం లేదా
స్లీప్ ఆప్నియా వంటి ఆరోగ్య సమస్యల కారణంగా వస్తుంది. ప్రారంభ దశలో లక్షణాలు లేకపోయినా, తీవ్రమైన లేదా నియంత్రించని రక్తపోటు వల్ల తలనొప్పి, తలనిలువు తిరగడం, మబ్బుగా కనిపించడం, అలసట, ఛాతిలో నొప్పి, గుండె చప్పుళ్ళు అసమానంగా ఉండటం, శ్వాసలో ఇబ్బంది వంటి సంకేతాలు కనబడవచ్చు. ఇవి గుర్తించి వైద్య సాయం తీసుకోవడం చాలా ముఖ్యం అని వైద్యులు సూచిస్తున్నారు.
హైపర్ టెన్షన్ నివారణకు సూచనలు
1. రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకోవాలి
2. ధూమపానం, మద్యం వాడకాన్ని నివారించాలి
3. ఆరోగ్యకరమైన బరువును నిలుపుకోవాలి
4. ఆహారంలో పండ్లు, కూరగాయలు, పౌష్టిక ధాన్యాలు చేర్చాలి
5.ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు శారీరక చర్యలు చేయాలి.
6. మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ధ్యానం, యోగా వంటివి చేయాలి
7. రెగ్యులర్ బీపీ చెకప్ చేయించుకోవాలి.
హైపర్ టెన్షన్ బాధితులు రోజురోజుకూ పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోందని, ఇది హృదయ సంబంధిత వ్యాధులు, బ్రెయిన్ స్ట్రోక్, మూత్రపిండాల వైఫల్యం, ఆకాల మరణాలకు ప్రధాన కారణంగా మారుతోందని డాక్టర్ ఊడుగుల సురేశ్ వెల్లడించారు. హైపర్ టెన్షన్ మొదటి దశలో ఎలాంటి లక్షణాలు ఉండవని, అందుకే దీన్ని మౌన హంతకుడు అంటారని చెప్పారు. ఇది నియంత్రించకుండా వదిలితే శరీర అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని వివరించారు. బ్రెయిన్ స్ట్రోక్, గుండెపోటు, చూపు కోల్పోవడం, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుందని, సరైన అవగాహనతో, సమయానికి తగిన వైద్యం తీసుకుంటే ప్రాణాలను రక్షించొచ్చని స్పష్టం చేశారు.