•  హుజూరాబాద్ ఎమ్మెల్యేకు జెడ్పీటీసీ శ్రీరామ్ ప్రశ్న

వేద న్యూస్, జమ్మికుంట:
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రజా సమస్యలను గాలికి వదిలేసి బూడిద పంచాయితీ ముందు పెట్టుకొని పబ్బం గడుపుతున్నారని జమ్మికుంట జెడ్పీటీసీ శ్రీరామ్ శ్యామ్ విమర్శించారు. జమ్మికుంటలోని తన కార్యాలయంలో ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ఎన్నికల సందర్భంగా హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెలిస్తే రూ.1000 కోట్లు తీసుకొచ్చి హుజూరాబాద్ నియోజకవర్గం అభివృద్ధి చేస్తానని కౌశిక్ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

ఆ హామీలన్నీ గాలికి వదిలేసి కేవలం తెలంగాణ భవన్ ఖాళీ ఉందని అక్కడ ప్రెస్ మీట్‌లు పెట్టడం తప్ప హుజురాబాద్‌కు చేసేది ఏం లేదన్నట్టు కౌశిక్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.హుజురాబాద్ నియోజకవర్గం లో దళిత బంధు 10 లక్షల రూపాయలకు కింద కొంతమంది లబ్ధిదారులకు 5 లక్షల రూపాయలు మాత్రమే వచ్చాయని, ఎన్నిసార్లు దళిత బంధు లబ్ధిదారులు అధికారులకు, నాయకులకు విన్నవించుకున్నప్పటికీ సమస్య పరిష్కారం కావడం లేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకులు సైతం కేవలం బూడిద పంచాయతీ ముందేసుకుని పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను అమలు చేయలేని పక్షంలో ప్రజలు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.