- వరంగల్ ఎంపీ బరిలో ఓ సీనియర్ జర్నలిస్టు!
- కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఓరుగల్లు
- పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్న ఓ పోలీస్ అధికారి!
- వరంగల్ పార్లమెంట్ స్థానంలో హస్తం పాగా ఖాయమేనా!
- బీఆర్ఎస్ పార్టీ తరఫున బరిలో మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్!
- ఎవరికి వారు కాంగ్రెస్ టికెట్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారట!
వేద న్యూస్, వరంగల్ క్రైమ్:
పెన్ను, గన్ను పొలిటికల్ బాటలో పయనించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇన్నాళ్లు వృత్తి జీవితంలో సేవలందించిన..క్రమంలో విస్తృత ప్రజాసేవలో కొనసాగేందుకు ఖద్దర్ ధరించాలనే ఆలోచనతో అడుగులు పడుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల వేడి రాష్ట్రంలో అప్పుడే మొదలైంది. పొలిటికల్ హీట్ రోజురోజుకూ క్రమంగా పెరుగుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలను రచించుకుంటున్నాయి. పార్టీ ముఖ్య నేతలతో సమీక్షా సమావేశాలు నిర్వహించుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి రాజకీయంగా అదృష్టం పరీక్షించుకునేందుకు మాజీ పోలీసు అధికారులు, జర్నలిస్టు సంఘాల నేతలు సంసిద్ధమవుతున్నారు. గతంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో పోలీస్ బాస్ గా విధులు నిర్వహించిన ఓ పోలీస్ అధికారి ఇందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో కీలక పదవిలో విధులు నిర్వహించిన ఓ పోలీసు అధికారి వర్ధన్నపేట నుంచి ఎమ్మెల్యే అయిన సంగతి అందరికీ విదితమే. కాగా, ఈ సారి మరో పోలీసు అధికారి ఎంపీ బరిలో ఉంటారని సోషల్ మీడియాలో పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సంగతి ప్రస్తుతం వరంగల్ జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
వరంగల్ పార్లమెంట్ లోక్ సభ స్థానంపై గురి పెట్టిన కొందరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ పార్టీని వీడి హస్తం పార్టీలో చేరాలనుకుంటున్నట్లు టాక్. గులాబీ గూటిని వీడి హస్తం కండువా కప్పుకుంటే గెలుపు ఖాయమనే అంచనాను వారు వేసుకుంటున్నట్లు సమాచారం. ఈ దిశగా ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరంగానే చేస్తున్నట్లు రాజకీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ తరఫున వర్ధన్నపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ఆరూరి రమేష్ సైతం వరంగల్ ఎంపీ బరిలో ఉన్నట్లు సమాచారం.
కొందరు జర్నలిస్టులు సైతం లోక్ సభ బరిలో నిలిచి అదృష్టాన్ని పరిశీలించుకోవాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆయా జర్నలిస్టు సంఘాల నేతలుగా, వృత్తి జీవితంలో ప్రజలతో సంబంధాలు కలిగిన తాము విస్తృతమైన ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతో పార్లమెంటు బరిలో నిలవాలని డిసైడ్ అయ్యారట. ఇక వరంగల్ ఎంపీగా పోటీకి ఓ పోలీస్ అధికారి మొత్తం రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు టాక్.
అయితే, ఇప్పటికి ఉన్న రాజకీయ వాతావరణం దృష్ట్యా కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి వరంగల్ కంచుకోటగా మారింది. ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దానికి తోడు రాష్ట్రంలో కాంగ్రెస్ ‘ప్రజాపాలన’ వంటి కార్యక్రమాలతో జనంలో, కాంగ్రెస్ శ్రేణుల్లో విశ్వాసం పొందే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వెరసి ఈ సారి వరంగల్ పార్లమెంట్ స్థానం కాంగ్రెస్ పార్టీదేననే అభిప్రాయాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధీమాగా వ్యక్తం చేస్తున్నాయి.