- పోలీసు వ్యవస్థ శైలి మారాలి
- మరిన్ని సంస్కరణలు అవసరమని పలువురి అభిప్రాయం
వేద న్యూస్, కృష్ణ :
క్షణం తీరిక లేని ఉద్యోగం..నిత్యం శాంతిభద్రతలతో సావాసం.. అల్లర్లు, దొంగతనాలు, గొడవలు, దాడులు, దౌర్జన్యాలు లేని సమాజం కోసం ఆరాటం.. సమస్యలతో అల్లాడుతున్న జనానికి మేమున్నామనే భరోసా.. సమాజ రక్షణలో ముందుండే రియల్ హీరో ‘‘పోలీస్’’.
ప్రతీ ఒక్కరు తమ ఆపద కాలంలో ఆశ్రయించేది పోలీస్ స్టేషన్నే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలా అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజా శ్రయేస్సు కోసం పని చేసే పోలీస్ వారు సామాన్యుడికి అందుబాటులో ఉండే పరిస్థితులు పలుచబడుతున్నాయి.
∫
అధికారం కేంద్రీకృతమైన వ్యవస్థగా మారడంతో శాఖలన్నీ దాదాపుగా పాలకులకు సాగిలబడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇందులో పోలీస్ శాఖ కూడా ఉంటోంది. దాంతో వ్యవస్థగా ఉన్న ఖాకీలపైన సామాన్యుడికి నమ్మకం సన్నగిల్లే పరిస్థితులు మెండుగా ఏర్పడుతున్నాయి.
రోజువారి విధుల నిర్వహణ, కేసుల పరిష్కారంతో పాటు ప్రముఖుల భద్రత విషయం కూడా పోలీసులకు తప్పనిసరి అయిపోతోంది. దాంతో ప్రజల కేసుల పరిష్కారానికి ఖాకీలకు సమయం చాలడం లేదు. అలా ఖాకీలపై ఒత్తిడి కత్తి వేలాడుతోందని, ముఖ్యంగా స్టేషన్ ఎస్ఎచ్ఓ లకు ఒత్తిళ్లు రాజకీయంగా ఉంటున్నాయని కొందరు పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారులు బహిరంగంగానే చెప్తున్నారు.
సామాన్యులతో పాటు ఖాకీలకూ ఉన్నది 24 గంటల సమయమే. కాగా, ఈ సమయంలో వారు తమ విధి నిర్వహణలో పోలీస్ స్టేషన్ నిర్వహించుకోవడంతో పాటు తమ పై అధికారుల ఆదేశాల ప్రకారం పని చేయాల్సి వస్తోంది.
తమ రోజు వారి పోలీస్ స్టేషన్ డ్యూటీల నిర్వహణతో పాటు ప్రముఖులకు భద్రతా, బందోబస్తు పనులు కూడా పోలీస్ శాఖనే చూసుకోవాల్సి వస్తోంది. మంత్రి లేదా ఎమ్మెల్యే సొంత నియోజకవర్గ పరిధిలో పర్యటనకు వస్తే ఏసీపీ, సీఐ, ఎస్ఐలు అందరూ ఎస్కార్ట్ ఇవ్వడం సాధారణ విషయంగా జరుగుతోంది. దాంతో మిగతా పనులకు పోలీస్ స్టేషన్లలో సిబ్బంది కొరత ఉంటుందనేది నిర్వివాదాంశమే.
ఉదాహరణకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మిల్స్ కాలనీ పీఎస్ విషయానికొస్తే..గతేడాది ఈ పోలీస్ స్టేషన్ లో సుమారు 700కు పైగా కేసులు నమోదయ్యాయి. వాటిలో సగానికి పైగా కేసులు పరిష్కారం ఇంకా కాలేదని తెలుస్తోంది. అందుకు కారణాలు ఏంటనేది పోలీస్ శాఖ నిశితంగా పరిశీలించే ఆలోచన చేయాలి.
సంవత్సరానికి 365 రోజులు ఉండగా, అందులో సెలవు దినాలు, పోలీస్ బందోబస్తు, ఎస్కార్ట్ డ్యూటీలు పక్కనబెడితే పోలీసులకు కేసుల విచారణకు ఎంత సమయం కేటాయించబడుతున్నది? అనేది శాస్త్రీయంగా పరిశీలించాల్సిన అవసరముంది. కేసు విషయమై వారు సరైన ఇన్వెస్టిగేషన్ చేసి ఆధారాలు సమకూర్చని పక్షంలో కేసు న్యాయస్థానం ఎదుట నిలబడబోదనేది అందరికీ తెలిసిందే.
ఈ నేపథ్యంలో పోలీసులకు కేసుల విషయమై పరిశోధనకు తగు సమయం ఎలా సమకూరుతుందనేది ప్రశ్నగానే ఉంటోంది. సాధారణంగా జనం ఇప్పుడు డిజిటల్లీ అవేర్డ్(టెక్నాలజీ పట్ల అవగాహన కలిగి ఉన్నారు). ప్రతీ పనిలో వేగాన్ని కోరుకుంటున్నారు. వేగవంతమైన జీవన విధానాలకు అలవాటు పడిన జనానికి పోలీస్ శాఖ వేగం పైన నమ్మకం ఏర్పడాలంటే..ఎలాంటి విధానాలను అవలంభించాలి? అనేది పరిశీలించాలి.
ఈ అంశాలన్నీ కూడా సామాన్యుడికి పోలీస్ పైన నమ్మకం సన్నగిల్లే స్థితికి చేకూరే దిశగా మారుతాయి. పోలీసులు పొలిటికల్ బందోబస్తుల్లో బిజీగా ఉంటే సామాన్యుడికి న్యాయం చేసేది ఎవరు? అన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంటుందనేది కొందరి వాదన.