వేద న్యూస్, జమ్మికుంట:
‘‘సరదాగా మొదలై / ధూమ పానం/ పాడెదాకా శీఘ్రంగా / మోసుకెళ్లడం ఖాయం’’ అని.. ధూమపానం వల్ల కలిగే నష్టంపై ఓ కవి రాసిన మాటలు అక్షరసత్యాలు. స్మోకింగ్, పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే నష్టాలపై బహిరంగ ప్రదేశాల్లో బోర్డులు డిస్ప్లే చేయడంతో పాటు సినిమా హాల్లో యాడ్స్ విరివిగా మనకు కనిపిస్తాయి. అయినా జనం మాత్రం పొగాకు ఉత్పత్తులకు ఆకర్షితులవుతున్నారు.
సరదాగా టీనేజ్‌లో పొగ తాగడానికి అలవాటు పడి… క్రమంగా దానికి బానిసలై ఆ ఊబిలో దిగబడిపోయి, బయటపడలేక అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నవారు ఎందరో ఉంటున్నారు. స్మోకింగ్ మనలను మృత్యువు వైపు తీసుకెళుతున్న సంగతి కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నా ‘పొగ తాగడానికి’ ఎందుకు గుడ్ బై చెప్పలేక పోతున్నాము? అనే ప్రశ్నను తమను తాము సంధించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ‘వరల్డ్ నో టొబాకో డే’ సందర్భంగానైనా ‘స్మోకింగ్‌కు నో’ చెప్పాలని ఆశిద్దాం.
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 31న జరుపుకుంటారు. పొగాకు వినియోగం వల్ల కలిగే హానికరమైన ప్రభావాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, పొగాకు మానేయడానికి వారిని ప్రేరేపించడం ఈ దినోత్సవ ఉద్దేశ్యం.
పొగాకు రహిత దినోత్సవ చరిత్ర:
పొగాకు తీసుకోవడం వల్ల కలిగే వ్యాధులు, మరణాలను అరికట్టడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో-WHO) 1987 లో ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది. మొదటిసారిగా, అంతర్జాతీయ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని 1988 మే 31న జరుపుకున్నారు. దీని తర్వాత, ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం ప్రారంభించారు.
ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం 2025 -థీమ్:
WHO ప్రతి సంవత్సరం ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవానికి ఒక థీమ్‌ను నిర్దేశిస్తుంది. 2025 సంవత్సరానికి ఇతివృత్తం “పొగాకు ఉత్పత్తుల ఆకర్షణను తగ్గించడం”.
పొగాకు వాడకంతో హానికరమైన ప్రభావాలు:
డాక్టర్ ఊడుగుల సురేశ్ , ఎండీ జనరల్ ఫిజీషియన్, సంజీవని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి జమ్మికుంట
పొగాకు వాడకం వల్ల ఊపిరితిత్తులు, నోరు, గొంతు, కడుపు మొదలైన వాటికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. గుండె సంబంధిత వ్యాధులు కూడా రావచ్చు. శ్వాస సమస్యలు ఉంటాయి.
పొగాకు వాడకం వల్ల పురుషులు, స్త్రీలలో సంతానోత్పత్తి సమస్యలు వస్తాయి. అకాల మరణం సంభవించే ప్రమాదం సైతం ఉంది. కాబట్టి స్మోకింగ్ హ్యాబిట్, పొగాకు ఉత్పత్తులు తీసుకునే అలవాట్లను మానుకోవడం మంచిది. పొగాకు వల్ల ప్రపంచంలో ప్రతి సంవత్సరం 8 మిలియన్లకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి.పొగాకు ప్రమాదాల గురించి, క్యాన్సర్, గుండె జబ్బులు, స్ట్రోక్, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు వంటి దాని సంబంధిత వ్యాధుల గురించి అవగాహన కల్పించడం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ మే 31న ప్రపంచ పొగాకు నివారణ దినోత్సవం నిర్వహిస్తోంది. ఇది ముఖ్యంగా యువత, పిల్లలకు పొగాకుకు దూరంగా ఉండాలనే సందేశాన్ని ఇస్తుంది.