- కళారాధకుడిగా, నటుడిగా, రచయితగా, దర్శకుడిగా బహుముఖ పాత్రలు
- ఎన్నో అవార్డులు, రివార్డులు, ప్రశంసలు అందుకున్న అధ్యాపకుడు రవీందర్
- కళారంగంలో సవ్యసాచిగా పేరు గాంచి.. జీవిత పాఠాలూ బోధించే టీచర్
- సామాజిక సేవా కార్యక్రమాలలోనూ ముందు వరుసలో ఉపాధ్యాయుడు
వేద న్యూస్, వరంగల్:
తన వృత్తి ధర్మాన్ని అంత:కరణ శుద్ధితో, అంకితభావంతో నిర్వర్తిస్తున్న ఆదర్శ గురువు ఆడెపు రవీందర్. ఎంతో మంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దిన ఆడెపు.. అధ్యాపకుడిగా విద్యార్థులకు నిత్యం పుస్తకాల్లోని పాఠాలతో పాటు జీవిత పాఠాలూ బోధిస్తూ.. తాను నేర్చుకుంటూ..నిత్య విద్యార్థిగా ముందుకెళ్తుండటం విశేషం. ఈ క్రమంలోనే తనలోని బహుముఖ కళల ద్వారా సమాజానికి తిరిగి సేవ చేస్తూ.. సమాజ సేవలో రుణం తీర్చుకునేందుకు ముందు వరుసలో నిలుస్తున్నారు. కళారాధకుడిగా, నటుడిగా, రచయితగా, దర్శకుడిగా బహుముఖ పాత్రలు నిర్వర్తిస్తున్న ఆదర్శ గురువు ఆడెపు రవీందర్ సేవలపై ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ‘వేద న్యూస్’ తెలుగు దినపత్రిక అందిస్తున్న ప్రత్యేక కథనం..
అన్ని రంగాల్లో రాణిస్తున్న రంగశాయిపేటవాసి
ఒంటిమామిడిపల్లెలో ఆడెపు చంద్రమౌళి -సుగుణమ్మ దంపతులకు జన్మించిన రవీందర్ ఆడెపు పుట్టకతోనే అన్ని సుగుణాలను అలవర్చుకున్నారు. తల్లిదండ్రుల పెంపకంలో విలువలను పెంపొందించుకున్న రవీందర్.. విద్యాబోధన రంగంలో అడుగుపెట్టి ఆ తర్వాత కళా రంగంతో పాటు మిగతా రంగాల్లోకి తన శక్తి మేరకు వెళ్లి సత్తా చాటుతున్నారు. నటుడిగా, రచయితగా, దర్శకుడిగా, కళారంగంలో సవ్యసాచిగా పేరు గడించారు.
వృత్తిరీత్యా విద్యాబోధన చేస్తూ..కళారాధన తన ప్రవృత్తిగా ముందుకెళ్తున్నారు. తన విద్యార్థులకు పాఠ్యపుస్తకాలలోని జ్ఞానాన్ని బోధిస్తూ..ప్రాపంచిక దృక్పథాన్ని, ప్రజల కోసం ఆలోచించే దృష్టికోణాన్ని అందించేందుకు రవీందర్ మార్గనిర్దేశనం చేస్తూ..విద్యార్థులు రేపటి పౌరులుగా చక్కటి సామాజిక స్పృహ కలిగి ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. సామాజిక స్పృహ కలిగిన టీచర్‌గా సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడంలోనూ ముందు వరుసలో నిలుస్తున్నారు.
మట్టిలో మాణిక్యం రవీందర్
1993లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా బాలుర ప్రాథమిక ఉన్నత పాఠశాల రంగశాయిపేటలో నియమితులైన రవీందర్ ఆడెపు.. అంచెలంచెలుగా ఎదిగి ఉద్యోగోన్నతలు పొందారు. 1998లో స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందుతూ గవర్నమెంట్ హై స్కూల్ రైల్వే గేట్ వరంగల్ కు బదిలీ అయ్యారు. 10 సంవత్సరాలు ఉర్సు ప్రభుత్వ పాఠశాలలో పని చేసి.. ఆ తర్వాత గవర్నమెంట్ హై స్కూల్ శంభునిపేట పాఠశాలకు ట్రాన్స్‌ఫర్ అయ్యారు.
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా 2012లో అవార్డు అందుకున్నారు. 8వ, 9వ తరగతి సాంఘిక శాస్త్ర పుస్తకాల రచయితల్లో ఒకరిగా ఆనాటి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శైలేంద్ర నాథ్ చే సన్మానం పొందారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కాకతీయ సోషల్ స్టడీస్ ఫోరం అధ్యక్షుడిగా 10 సంవత్సరాలు పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. ‘కాలంలో బాలవక్త’, ‘మీలో లక్షాధికారి ఎవరు?’ మాదిరి ఐక్యరాజ్యసమితి వంటి భారీ కార్యక్రమాలను నిర్వహించారు.
అర నిమిషంలో భారతదేశ పటం గీయగల నైపుణ్యం
వరంగల్ అర్బన్ జిల్లా సోషల్ స్టడీస్ ఫోరం అధ్యక్షునిగా టెన్త్ క్లాస్ విద్యార్థులకు ప్రతి సంవత్సరం
టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తూ.. టాలెంట్ ఉన్న విద్యార్థులను ఎంకరేజ్ చేస్తున్నారు. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ శిబిరాల్లో రిసోర్స్ పర్సన్ గానూ విధులు నిర్వహిస్తున్నారు.
జిల్లా విద్యాశాఖ ఉత్తర్వుల ప్రకారం సోషల్ వెల్ఫేర్, కేజీబీవీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్లలోవిద్యార్థులకు ప్రత్యేక తరగతులలో పదో తరగతి విద్యార్థులకు సాంఘిక శాస్త్ర బోధన చేపడుతున్నారు. అర నిమిషంలో భారతదేశ పటం గీయగల నైపుణ్యం రవీందర్ సొంతం.
హాఫ్ మినట్‌లో దేశ చిత్రపటం గీసి ఒక నిమిషంలో 50 ప్రదేశాలను, మరొక నిమిషంలో ప్రపంచ పటం గీసి రెండు నిమిషాల్లో 100 ప్రదేశాలను గుర్తించగలిగే నైపుణ్యం రవీందర్ కలిగి ఉండటం చూసి విద్యార్థులు ఇప్పటికీ స్ఫూర్తి పొందుతుంటారు. ఒకేరోజులో వరుసగా ఎనిమిది గంటల పాటు బోధించి పదో తరగతి మొత్తం సిలబస్ రివిజన్ చేయగలిగిన సామర్థ్యం కూడా ఆయన సొంతం.
రచయితగానూ కీర్తి గడించిన రవీందర్
అమ్మాయి పెళ్లి, ఇకనైనా మారండి, యమలోకంలో నిరుద్యోగి, బాలనాటికల పుస్తకాలు రచించారు.
2000 సంవత్సరంలో రైల్వే గేట్ విద్యార్థుల చే హైదరాబాద్ బాలల అకాడమీలో నాటిక ప్రదర్శన ఇప్పించి.. నటుడు నూతన ప్రసాద్ చేతుల మీదుగా అవార్డు అందుకన్నారు. వరుడు డాట్ కాం.. నాటిక రచన నెల్లూరులో నంది నాటకోత్సవాల్లో ప్రదర్శితమై ప్రశంసలందుకుంది.
కష్టమేవ జయతే, కాదేది కవితకనర్హం ..వంటి కవితా సంపుటిలు రవీందర్ రచించగా, ప్రముఖ కవి జయరాజ్ ఆవిష్కరించారు. ఆడెపు రచించిన ‘నాన్న నాటిక’ను మాజీ ఎంపీ పసునూరి దయాకర్ ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మించిన
‘జై తెలంగాణ’ సినిమా కథా రచన రవీందర్ అందించారు. వర్ష ప్రొడక్షన్స్ నిర్మించిన సీత శ్రీరామ్
సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు పాటలు అందించారు.
‘‘31 జిల్లాల తెలంగాణ మాది’’ అనే పాట రచించగా, దానిని గత సీఎం సతీమణి ఆవిష్కరించారు. ‘‘సర్కారు బడికి వెళ్దాం..’’ అనే పాటను రచించిగా..గత అర్బన్ జిల్లా విద్యాశాఖఅధికారి నారాయణరెడ్డి రిలీజ్ చేశారు. సమాజానికి ఉపయోగపడే అనేక పాటలను రచించారు. విద్యా బోధనలో 30 ఏండ్లకు పైగా అనుభవం కలిగిన రవీందర్.. విద్యార్థులను నవభారత నిర్మాతలుగా, బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దడంలో తన వంతు పాత్రను శక్తివంచన లేకుండా నిర్వర్తిస్తున్నారు.