• కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల జాడ లేదు!
  • గుంపులు గుంపులుగా కుక్కల విహారం..జంకుతున్న జనం
  • ఈ విషయమై అసలు పట్టించుకోని జీడబ్ల్యూఎంసీ అధికారులు!

వేద న్యూస్, వరంగల్:
వరంగల్ నగరంలో పలు ప్రాంతాల్లో కుక్కల బెడద రోజురోజుకూ మరింతగా ఎక్కువవుతోంది. కుక్కలు గుంపులు గుంపులుగా స్వైర విహారం చేస్తున్నాయి. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై వీధికుక్కలు దాడి చేస్తున్నా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే అరోపణలు లేకపోలేదు. రోజురోజుకూ కుక్కల దాడులు ఎక్కువవుతున్నాయి. నగరవాసులపై కుక్కలు మీద పడి రక్కుతున్నా..అధికారులు మాత్రం నియంత్రణ చర్యలు తీసుకోకుండా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని చెప్పుకోవచ్చు.

వరంగల్ నగరంలో సుమారు 20 వేలకు పైగా కుక్కల సంచారం ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. జంతు సంరక్షణ చట్టం కింద వీటిని చంపడానికి వీలు లేకపోయినప్పటికీ..శాస్త్రీయంగా వీటికి కుటుంబ నియంత్రణ చికిత్స చేసే వెసులుబాటు ఉంది. అయితే , కుక్కలను పట్టుకోవడం నుంచి ఏబీసీ, యాంటీ రేబిస్‌ వ్యాక్సినేషన్‌ (ఏఆర్‌వీ), డీ వార్మింగ్‌ చేసిన అనంతరం వదిలి పెట్టే వరకు జీడబ్ల్యూఎంసీ ప్రైవేట్‌ ఏజేన్సీ ద్వారా నిర్వహిస్తోంది.

ఇందుకోసం ఒక్కో కుక్కకు రూ.800 చొప్పున ఇస్తుంటారు. అయినప్పటికీ నగరంలో కుక్కల దాడులు ఆగడం లేదు. జీడబ్ల్యూఎంసీ అధికారులు ఈ పనిని ప్రైవేటు ఏజెన్సీకి ఇవ్వడం ద్వారా వారు సరైన పద్ధతిలో కుటుంబ నియంత్రణ చికిత్స చేయకుండానే కాగితాలపై లెక్కలు చూపిస్తూ డబ్బులు తీసుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

ఇప్పటికైనా అధికారులు స్పందించి నగరవాసులపై వీధి కుక్కల దాడులు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, కుక్కల బెడద నుంచి తమను రక్షించాలని, కుక్కల నియంత్రణకు కృషి చేయాలని నగరవాసులు కోరుతున్నారు.

 

తగు చర్యలు తీసుకుంటున్నాం: రాజేష్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్, జీడబ్ల్యూఎంసీ

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 66 వ డివిజన్లలో సుమారు 20 వేలకు పైగా కుక్కలు ఉన్నాయి. వాటిని పట్టుకోవడానికి మూడు వాహనాలు ఉన్నాయి. రోజుకు 30 నుంచి 40 కుక్కలను పట్టుకుంటున్నారు. కుక్కలను చంపకూడదు కాబట్టి ఏబీసీ, యాంటీ రేబిస్‌ వ్యాక్సినేషన్‌ (ఏఆర్‌వీ), డీ వార్మింగ్‌ చేసిన అనంతరం వదిలిపెడుతున్నారు. ఇదంతా కూడా ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా నిర్వహిస్తుంటాము.

ఒక్కో కుక్కకు రూ.800 చొప్పున ఖర్చు చేస్తుంటాము. కుక్కల నియంత్రణకు రూ.కోట్ల ఖర్చు అవుతుంది. కుక్కలు దాడులు చేయడానికి కారణం వాటికి సరైన ఆహారం, నీరు దొరకకకపోవడం. కాగా, ఈ క్రమంలోనే వీధికుక్కలు దాడులకు పాల్పడుతున్నట్లు గుర్తించాము. కుక్కలకు వేసవికాలం వరకు అక్కడక్కడ ఆహారం, నీరు ఏర్పాటు చేయాలని చూస్తున్నాము. అలాగే కుక్కల దాడి నుంచి ప్రజలు ఎలా తప్పించుకోవాలో అవగాహన కూడా కల్పిస్తాము. ముఖ్యంగా స్కూళ్లలో, ఇంట్లో తల్లి తండ్రులు తమ పిల్లలు ఆడుకునేటప్పుడు గమనిస్తూ ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా.