వేద న్యూస్,డెస్క్:
కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వేస్తున్నట్లుగా లోక్‌సభ సెక్రటేరియెట్‌
శుక్రవారం ప్రకటించింది. పరువు నష్టం దావా కేసులో గురువారం ఆయనకు సూరత్‌ కోర్టు రెండేళ్ల శిక్ష విధించిన సంగతి తెలిసిందే.
ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్‌ 8(3) ప్రకారం పార్లమెంట్‌ సభ్యుడు ఏదైనా కేసులో రెండేళ్ల కనీస శిక్ష, ఆపై శిక్ష పడితే అనర్హత వేటు పడి పదవీ కోల్పోతారు.

ఈ నేపథ్యంలో ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ల ప్రకారం ఆయనపై అనర్హత వేటు అమలు చేస్తున్నట్లు లోక్‌సభ సెక్రటేరియెట్‌ ప్రకటించింది. 2019 ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ కేరళ వయనాడ్‌ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా విజయం సాధించారు. తాజా నిర్ణయంతో ఆయన ఎంపీగా అర్హత కోల్పోయారు. తీర్పుపై అభ్యర్థన పిటిషన్‌కు కోర్టు 30 రోజుల గడువు ఇచ్చినప్పటికీ ఈలోపే ఆయనపై అనర్హత వేటు అమలు చేస్తున్నట్లు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ ప్రకటించారు.