• ఎకో టూరిజం జోన్ గా ఏర్పాటు చేయాలి
  • పర్యావరణ పరిరక్షణ ఐక్య వేదిక, జనవిజ్ఞాన వేదిక, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ డిమాండ్
  • దేవునూరు గుట్టల్లో ‘అటవీ నడక’లో పాల్గొన్న పర్యావరణ ప్రేమికులు

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి/ధర్మసాగర్:
హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం దేవునూరు గ్రామంలోని ‘ఇనుప రాతి గట్ల అడవులను’ అటవీ రక్షిత ప్రాంతంగా (రిజర్వ్ ఫారెస్ట్) ప్రకటించాలని పర్యావరణ పరిరక్షణ ఐక్య వేదిక, జనవిజ్ఞాన వేదిక, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ సంస్థల సభ్యులు డిమాండ్ చేశారు. ఆదివారం పర్యావరణ పరిరక్షణ ఐక్యవేదిక అధ్వర్యంలో పర్యావరణ ప్రేమికులు ఇనుప రాతి గుట్టల్లోని అడవిలో పది కిలో మీటర్ల ‘అటవీ నడక’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పర్యవరణ పరిరక్షణ ఐక్యవేదిక అధ్యక్షులు కాజీపేట పురుషోత్తం మాట్లాడారు.

హన్మకొండ జిల్లాకేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏకైక అటవీ ప్రాంతమైన ‘ఇనుప రాతి గట్ల’లో అక్రమ మైనింగ్ ను నిషేధించాలని కోరారు. అక్రమ పట్టాలను రద్దు చేయాలన్నారు. ఈ అటవీ ప్రాంతాన్ని ‘ఎకో టూరిజం జోన్’గా ఏర్పాటు చేయాలని పర్యావరణ పరిరక్షణ ఐక్యవేదిక, జన విజ్ఞాన వేదిక, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ సభ్యులు నూతన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

‘అటవీ నడక’ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులకు ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ కాలుష్యాలు, క్యాన్సర్ కారక వ్యాధులు గురించి వివరించారు. వారసత్వ సంపద, జిల్లాలోని ఏకైక అడవిని సంరక్షించే బాధ్యత అన్ని హరిత సంఘాల పై ఉందని అందరిచే పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించారు.

కార్యక్రమంలోపర్యవరణ పరిరక్షణ ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి టి.శ్రావణ్ కుమార్, ఉపాధ్యక్షులు పిట్టల రవిబాబు, కోశాధికారి నల్లెల్ల రాజయ్య, జన విజ్ఞాన వేదిక సభ్యులు ధర్మ ప్రకాశ్, సురేశ్, రామానుజం, శ్రీనివాస్, ఉమా మహేశ్వర్ రావు, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ వ్యవస్థాపకులు శ్యాంసుందర్ శర్మ, జావీద్, నిర్మాణ్ ఫౌండేషన్ బృందం ఏలే వెంకటనారాయణ (ప్యాక్ట్సెట్), పున్న సంపత్ (జెపి మోర్గాన్), బాలే ప్రవీణ్ (క్యాప్ జెమినీ), శ్రీనివాస్ పురం, శ్రీనివాస్ మరియు పర్యావరణ ప్రేమికులు డా.లక్ష్మి, లలిత్, నవీన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, సుమ, మాధురి, ధర్మ సాగర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, అటవీ పరిశీలకుడు కమలాకర్ స్వామి, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.