వేద న్యూస్, వరంగల్ జిల్లా:

ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ప్రజలు అందజేసే ప్రతి దరఖాస్తును స్వీకరించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. వరంగల్ జిల్లా గ్రేటర్ వరంగల్ పరిధిలోని 20 వ డివిజన్ కాశిబుగ్గ లో గల బి ఎన్ రావు కమ్యూనిటీ హాల్, 21 డివిజన్ లోతుకుంట లోని కమ్యూనిటీ హాల్ ల యందు కొనసాగుతున్న దరఖాస్తు స్వీకరణ కేంద్రాలను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి సమర్థంగా నిర్వహించుటకు తగు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని, ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించడం కోసం దరఖాస్తుల స్వీకరణ చేపట్టడం జరుగుతున్నదనన్నారు. అభయ హస్తం 6 గ్యారంటీలతో పాటుగా వివిధ సాధారణ సమస్యల పరిష్కారం కోసం వచ్చే ఫిర్యాదులను కూడా స్వీకరించి నమోదు చేసుకోవాలని తెలిపారు. 

ప్రతి కేంద్రంలో దరఖాస్తుల పంపిణీలో కొరత లేకుండా చూసుకోవడంతో పాటు బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ దరఖాస్తు ద్వారా సమర్పించే వాటిని కూడా స్వీకరించాలని, దరఖాస్తు లు స్వీకరించే క్రమం లో ప్రజలకు ఎదురయ్యే అనుమానాలను నివృత్తి చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మొహమ్మద్ ఫుర్ఖాన్ ,వరంగల్ (తూర్పు)నియోజకవర్గ నోడల్ అధికారి/డిప్యూటీ కమిషనర్ కృష్ణారెడ్డి, ఆర్ డి ఓ వాసు చంద్ర, జీ యం ఇండస్ట్రీస్ నరసింహమూర్తి, బయలజిస్ట్ మాధవ రెడ్డి, తహశీల్దార్ ఇక్బాల్, వార్డు నోడల్ అధికారి సుష్మ , టి పి ఓ బషీర్, శానిటరీ ఇన్స్పెక్టర్ ధరమ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.