వేద న్యూస్, వరంగల్ టౌన్ :

తెలంగాణ కుంభమేళా మేడారం – సారలమ్మ జాతరకు నేటి (ఆదివారం) నుంచి వరంగల్ లో ప్రత్యేక బస్సులు నడపడం జరుగుతుందని ఆర్టీసీ హనుమకొండ డిపో మేనేజర్ భూక్యా ధరంసింగ్  తెలిపారు. వరంగల్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న న్యూ బస్ షెల్టర్ నుంచి  ప్రత్యేక బస్సులు నడపడం జరుగుతుందని ఆయన అన్నారు.

ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చలువ పందిళ్ళు,  త్రాగు నీటి వసతి,  మరుగుదొడ్ల సౌకర్యం కల్పించినట్లు  డిఎం వివరించారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా నాలుగు క్యూలైన్లను ఏర్పాటు చేయడం జరిగిందనీ అన్నారు. భక్తుల భద్రత దృష్ట్యా సీసీ కెమెరాలు  ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వరంగల్ లోని బస్ షెల్టర్ నుంచి మొత్తం 430 బస్సులను అందుబాటులో ఉంచడం జరిగిందనీ ఈ నెల 18నుండి 25 వరకు ప్రత్యేక కౌంటర్ల ద్వారా బస్సులను నడపడం జరుగుతుందని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మహిళలకు తమ ఒరిజినల్ ఆధార్ , ఆయా గుర్తింపు కార్డులతో  ఆర్డినరీ , ఎక్స్ప్రెస్ బస్సులలో  ఉచిత ప్రయాణం ఉంటుందన్నారు.  మగవారికి టికెట్ ధర రూ. 250,  11 సంవత్సరాల లోపు బాలురకు రూ.140గా నిర్ణయించినట్లు తెలిపారు. వరంగల్ లోని మేడారం తాత్కాలిక బస్ పాయింట్ నుంచి సుమారు రెండు లక్షల మంది భక్తులను మేడారంకు తరలించడానికి ఏర్పాటు చేసినట్లు డిఎం వివరించారు. తిరుగు ప్రయాణంలో భక్తులను  వారి వారి  గమ్యస్థానాలకు చేర్చడానికి హనుమకొండ, వరంగల్,  కాజీపేట ప్రాంతాలకు ఉచిత బస్సులను నడపనున్నట్లు డిఎం తెలిపారు.

ములుగు రోడ్డు పాయింట్ నుంచి వరంగల్ రైల్వే స్టేషన్, హనుమకొండ బస్టాండు, కాజీపేట రైల్వే స్టేషన్ ల  వరకు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఉచిత బస్సులను నడపడం జరుగుతుందన్నారు. పోలీస్ శాఖ, గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్, విద్యుత్ శాఖ,  రైల్వే శాఖ, కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ, వైద్య ఆరోగ్యశాఖ, అగ్నిమాపక శాఖ స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగిందని భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర-2024 విజయవంతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని డిఎం భూక్య ధరంసింగ్ ఈ సంధర్బంగా కోరారు.