వేద న్యూస్, జమ్మికుంట:
మళ్లీ తిరిగిరాని అ‘పూర్వ’ ఘట్టం బాల్యం కాగా, ఆ‘నాటి’ జ్ఞాపకాలు, మధుర క్షణాలను ఎప్పటికీ గుర్తు చేసేది ‘నేస్తాలు’ మాత్రమే. అలాంటి స్నేహితులను కలుసుకోవాలనే ఆలోచన వస్తే చాలు.. ప్రతి ఒక్కరికీ సంతోషమే. ఆనందంగా చిన్న ‘నాటి’ మిత్రులతో సమయం గడపడం మనసుకు ఎంతో హాయినిస్తుంది . కానీ, ఉరుకుల పరుగుల జీవనంలో మిత్రులతో కనీసంగా మాట్లాడే సమయం కూడా దాదాపుగా కరువవుతున్న సందర్భం ప్రస్తుతం నెలకొంటున్నది. అలాంటి తరుణంలో దోస్తులతో హాయిగా రోజంతా గడిపేందుకు మిత్రులందరూ కలిసి తమ పాఠశాలను వేదికగా చేసుకుని.. కలుసుకుని రోజంతా హాయిగా టైం స్పెండ్ చేశారు. 16 ఏండ్ల తర్వాత విద్యార్థులు గెట్ టు గెదర్ ఏర్పాటు చేసుకుని తమ గురువులను సన్మానించారు. ఇందుకు కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట పట్టణంలోని విద్యోదయ హై స్కూల్ వేదికయింది.
జమ్మికుంట విద్యోదయ హై స్కూల్ 2008-2009 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు తమ పాఠశాలలో గెట్ టు గెదర్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమ్మేళనానికి తమకు పాఠాలు చెప్పిన గురువులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. తమలాంటి ఎంతో మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి, తీర్చిదిద్దిన గురువులను సన్మానించుకోవడం సంతోషంగా ఉందని స్టూడెంట్స్ వెల్లడించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి జీవితంలో గుర్తుండే తీపి జ్ఞాపకాలు చిన్నతనంలోనే ఉంటాయని చెప్పారు. చదువుకునే రోజులు, చేసే అల్లరి, వారితో కలిసి అడినఆటలు, పాడిన పాటలు, చిన్న చిన్న గ్యాంగ్ లు, స్నేహితుల కోసం చేసే ఫైటింగ్లు, అవన్నీ ఓ మధురమైనవిగా నెమరు వేసుకున్నారు.

తమ ఉన్నతికి తోడ్పాటు అందించి.. తమకు జీవితంలో అవసరమయ్యే విద్యనూ నేర్పిన గురువులను గౌరవిస్తూ. సన్మానించుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. తమ పాఠశాలలో చదువుకుని జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకున్న విద్యార్థులను చూస్తుంటే తమకు గర్వంగా ఉందని ఉపాధ్యాయులు వెల్లడించారు. స్నేహితులు, గురువులను కలుసుకునేందుకు ప్రత్యేకంగా చొరవ తీసుకుని సమ్మేళనం ఏర్పాటు చేసిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో విద్యోదయ స్కూల్ హెడ్ మాస్టర్ యేబూషి శ్రీనివాస్, టీచర్లు రాజేశ్, గోపి, నాగయ్య, శేఖర్, అశోక్, సంపత్, రాములు, విద్యార్థులు శ్రీకాంత్, రాకేశ్, శ్రీనివాస్, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.