కలెక్టర్ ఆఫీస్ కు బాధిత వృద్ధురాలితో పాటు వేద న్యూస్
– వెంటనే స్పందించిన ఆర్డిఓ
– వృద్ధాశ్రమంలో వృద్ధురాలిని చేర్పించిన డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ జయంతి
– వేద న్యూస్ తెలుగు దినపత్రికకు అభినందన
– ఇది అసలైన జర్నలిజం అని వేద న్యూస్ కి కితాబు

వేద న్యూస్, కమలాపూర్ :

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం శనిగరం గ్రామానికి చెందిన గుండెకరి అంబక్క (89) అనే వృద్ధురాలికి తనకు పుట్టిన కుమారులు, కుమార్తెలు తిండి పెట్టట్లేదని ఆకలితో అలమటిస్తుండగా ఆ విషయం వేద న్యూస్ దృష్టికి రాగా వేద న్యూస్ ఈనెల 11వ తారీఖున *’ఏడుగురిని కన్న తల్లికి ఏడుపే దిక్కా? ‘* అనే శీర్షికన కథనం ప్రచురించింది. ఆ తదుపరి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ వృద్ధురాలి సమస్యకి పరిష్కారం లభించలేదు. వృద్ధురాలి కుమారులు, కుమార్తెల నుంచి ఎటువంటి స్పందన రాలేదు. వేద న్యూస్ స్వయంగా వృద్ధురాలిని కలెక్టర్ ఆఫీస్ కి తీసుకెళ్లి అధికారుల దగ్గర వృద్ధురాలికి సంబంధించిన సమస్యను వివరించగా వెంటనే స్పందించిన ఆర్డిఓ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ కి వృద్ధురాలికి సంబంధించిన సమస్యను అప్పగించగా డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ అయిన జెట్టి జయంతి వృద్ధురాలి సమస్యను పూర్తిగా అర్థం చేసుకొని చలించిపోయి వ్యక్తిగతంగా సానుభూతి తెలియజేసి వృద్ధుల బాగోగులు బాగా చూసుకునే ఓ వృద్ధాశ్రమం నిర్వాహకులతో మాట్లాడి అప్పటికప్పుడే వృద్ధురాలికి వృద్ధాశ్రమంలో ఆశ్రయం కల్పించారు. వృద్ధురాలి సమస్య పట్ల, స్పందించిన తీరు పట్ల, పరిష్కరించిన విధానం పట్ల, విధుల పట్ల తనకున్న నిబద్ధత పట్ల డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ జయంతికి వేద న్యూస్ ధన్యవాదాలు తెలుపగా తమకు ధన్యవాదాలు వద్దనీ ఈ విషయంలో ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఇక్కడిదాకా వృద్ధురాలిని స్వయంగా తీసుకువచ్చి వృద్ధురాలి సమస్యకు పరిష్కారం లభించేలా సహకారం అందించిన వేద న్యూస్ కే తాను ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తన సమస్యను కలెక్టర్ ఆఫీస్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి తన సమస్యకు పరిష్కార మార్గం చూపించి వృద్ధాశ్రమంలో చేర్పించి తన ఆకలి బాధను తీర్చినందుకు ఆ వృద్ధురాలు వేద న్యూస్ తెలుగు దినపత్రికకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.