- ఉచిత విద్యుత్ ఇచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వమని వ్యాఖ్య
వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి:
మీలో ఒక్కడినై, మీతోనే ఉంటూ మీసేవ చేసుకుంటానని కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి వొడితల ప్రణవ్ అన్నారు. మంగళవారం హుజురాబాద్ మండలంలోని కాట్రపల్లి గ్రామంతో పాటు పట్టణంలోని ఇప్పల నర్సింగాపూర్, దమ్మక్కపేట, పాతవాడలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలోనే ఉచిత విద్యుత్ ను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన 100 రోజులలో కాంగ్రెస్ పార్టీ ఆరు హామీల అమలు చేస్తామని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. యువకులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు సరైన వసతులు లేవని, తనను గెలిపిస్తే హుజురాబాద్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో డిజిటల్ లైబ్రరీలతోపాటు స్టడీ సెంటర్లను ఏర్పాటు చేసి విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొల్లూరి కిరణ్, నాయకులు లావణ్య, సొల్లు బాబు, యెముల పుష్పలత కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.