• కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మోసపోతాం
  • ఎమ్మెల్యే దాసరిని భారీ మెజారిటీతో గెలిపించాలి
  • మైనార్టీల ఆత్మీయ సమ్మేళనంలో హోం మంత్రి మహమూద్ అలీ

వేద న్యూస్ పెద్దపల్లి/ఎలిగేడు:
బీఆర్ఎస్‌తోనే మైనార్టీల సంక్షేమ కార్యక్రమాలు ఉంటాయని, వారి సంక్షేమానికి గులాబీ పార్టీ కృషి చేస్తోందని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. పెద్దపెల్లి జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన మైనార్టీల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. షాదీ ముబారక్ తో నిరుపేద ఆడపిల్లల వివాహానికి చేయూతను అందిస్తున్నట్లు వివరించారు.

కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మోసపోతామని మహమూద్ అలీ హెచ్చరించారు. మైనార్టీ పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్లు పరిపాలించినా ముస్లింలను ఓటు బ్యాంకు గానే చూసారని, వారి సంక్షేమం కోసం కృషి చేయలేదని విమర్శించారు. బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి మైనార్టీల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నా రని వెల్లడించారు.

పెద్దపల్లిలో దాసరి మనోహర్ రెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని, ముస్లిం మైనారిటీలతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయని స్పష్టం చేశారు. మైనార్టీల సంక్షేమం కోసం కృషి చేస్తున్న దాసరి మనోహర్ రెడ్డిని..మరోసారి భారీ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని కోరారు. కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మెన్ ఇంటియాజ్ ఈసాక్ , మాజీ ఛైర్మెన్ అక్బర్ హుస్సేన్, రాష్ట్ర నాయకులు ఉమేజార్, నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ చార్జి పౌర సరఫరాల సంస్థ చైర్మెన్ రవీందర్ సింగ్, మున్సిపల్ చైర్ పర్సన్ దాసరి మమతా రెడ్డి, వైస్ ఛైర్మెన్ నాజ్మిన్ సుల్తానా-మోబిన్, కౌన్సిలర్ లు, ముస్లిం మత పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.