పుష్పాలంకరణతో భక్తులకు దివ్య దర్శనమిచ్చిన ఏడుపాయల వనదుర్గా భవాని అమ్మవారు*
 
*పట్టువస్త్రాలు, స్వర్ణాభరణాలు, పుష్పాలంకరణలో దేదీప్యమానంగా వెలిగిపోతున్న దుర్గమ్మ*

*కార్తీక దీపాలతో కాంతులీనిన ఆలయ ప్రాంగణం..*

*భక్తులతో కిటకిటలాడిన మంజీరా తీరం*

*వేద న్యూస్, పాపన్నపేట*

పవిత్ర కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల శ్రీ వనదుర్గా భవాని ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మంగళవారం పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు అమ్మవారికి విశేష అలంకరణ చేసి భక్తులకు దివ్య దర్శనం కల్పించారు.
వేకువజాము నుంచే ఆలయ అర్చకులు అమ్మవారి మూలవిరాట్టుకు పంచామృతాలు, పండ్ల రసాలతో మహాభిషేకం నిర్వహించారు. అనంతరం సుగంధ ద్రవ్యాలు, రంగురంగుల పూలమాలలు, పట్టువస్త్రాలు మరియు స్వర్ణాభరణాలతో అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు.
కార్తీక పౌర్ణమి సందర్భంగా మహిళలు తెల్లవారుజాము నుంచే గర్భగుడి ముందు ప్రవహించే మంజీరా నది పాయల్లో పుణ్యస్నానాలు ఆచరించారు. ఆలయ ప్రాంగణంలో మరియు నదీ తీరాన భక్తులు వెలిగించిన కార్తీక దీపాలతో క్షేత్రమంతా కాంతులీనింది. అదే విధంగా
ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానం పరిసరాలు అమ్మవారి నామస్మరణతో మార్మోగాయి. వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులు క్యూలైన్లలో వేచి ఉండి అమ్మవారిని దర్శించుకుని, ఒడిబియ్యం మరియు బోనాలతో మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *