•  విద్యార్థుల రాజకీయ పార్టీ నుంచి పోటీ
  • మార్పు కోసం వీఆర్పీ వైపు చూడాలని జనానికి పిలుపు
  • బ్యాట్ గుర్తుకు ఓటేయాలని ప్రజలకు అభ్యర్థి యువరాజు విజ్ఞప్తి

వేద న్యూస్, పరకాల:
రాష్ట్రంలో పరకాల అసెంబ్లీ ఎన్నికల పోరు ప్రతిష్టాత్మకంగా మారింది. హాట్ సీటుగా మారిన ఈ అసెంబ్లీ నుంచి బరిలో ఆరె సామాజిక వర్గానికి చెందిన యువకుడు, విద్యావంతుడు నిలవడం విశేషం. పరకాల నియోజకవర్గంలో దాదాపు 30 వేల ఓట్లున్న సామాజిక వర్గం నుంచి విద్యావంతుడైన యువకుడు విద్యార్థుల రాజకీయ పార్టీ(వీఆర్పీ) తరఫున పోటీలో నిలిచారు. బ్యాట్ గుర్తుపై పోరులో సదరు అభ్యర్థి ముందుకు సాగుతున్నారు. నిరుద్యోగుల కోసమే పురుడు పోసుకున్న వీఆర్పీ నుంచి పోటీ చేస్తున్న తనను పరకాల ప్రజలు ఆదరించి..ఆశీర్వదించాలని అభ్యర్థి సంగెకారి యువరాజు కోరుతున్నారు.

 

నిరుద్యోగులుగా యువత మిగలకూడదనే ఉద్దేశంతోనే ఏర్పడిన పార్టీ తరఫున బరిలో దిగినట్లు స్పష్టం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ తొమ్మిదేండ్ల కాలంలో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని, అన్ని వర్గాలను మోసం చేసిందని విమర్శించారు. ఇప్పటి వరకు ఒక్కొక్క నిరుద్యోగికి కేసీఆర్ 1,80,960/- రూపాయలు బాకీ ఉన్నాడని, ఈ క్రమంలో గులాబీ పార్టీకి నిరుద్యోగులు తమ బలం ఏంటో చూపాలని కోరుతున్నారు. వీఆర్పీ(విద్యార్థుల రాజకీయ పార్టీ) ఎన్నికల గుర్తు బ్యాట్ కు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. చూడాలి మరి..వీఆర్పీ అభ్యర్థి పరకాల రాజకీయాల్లో ఏ మేరకు ప్రభావం చూపుతారో..