• సిర్పూర్‌ టీ జడ్పీటీసీగా బరిలో యువకుడు
  •  కార్యాచరణ మొదలుపెట్టిన ‘మరాఠా మహా సంఘ్’
  •  నాలుగు మండలాలు కైవసం చేసుకునేలా కార్యాచరణ

వేద న్యూస్, కాగజ్ నగర్/ఆసిఫాబాద్:
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేడి తగ్గిందనుకునే లోపే మరి కొద్ది రోజుల్లో మరోసారి ఎన్నికల వేడి మొదలు కానుంది. స్థానిక సంస్థలకు ఎన్నికల నగారా మోగనున్న నేపథ్యంలో ఆశావహులు ఇప్పటి నుండే పోటీకి కసరత్తు మొదలు పెట్టారు. అయితే, ఏ పార్టీ నుండి పోటీలో ఉండాలనే ఆలోచనలతో ఆశావహులు ఇప్పుడు పరేషాన్ అవుతున్నారు. ఏ పార్టీ నుంచి బరిలో దిగితే విజయకేతనం ఎగురవేయవచ్చుననే అంచనాలు వేసుకుంటున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో మాత్రం భిన్న పరిస్థితి ఉంది. జిల్లాలో రెండు నియోజక వర్గాలు సిర్పూర్ కాగజ్ నగర్, ఆసిఫాబాద్ ఉండగా..సిర్పూర్ టీ అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ, ఆసిఫాబాద్ అసెంబ్లీ స్థానాన్ని బీఆర్ఎస్ దక్కించుకుంది. ప్రస్తుతం ఉన్న స్థానిక ప్రజా ప్రతినిధులు అక్కడక్కడ మినహా దాదాపు ఇన్ని రోజులు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ వారే ఉన్నారు. అయితే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్టీ మారి ఏ పార్టీ లో చేరాలి? అని వారు మదన పడుతున్నారు. ఈ క్రమంలోనే ‘మరాఠా మహా సంఘ్’ స్థానిక సంస్థల ఎన్నికలపై ఇప్పటికే ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన కార్యాచరణ మొదలు పెట్టినట్టు సమాచారం. ఈ సారి స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తాను చాటేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారట.

ప్రత్యేకంగా సిర్పూర్ టీ, చింతలమనేపల్లి, కౌటాల, దహేగం మండలాల్లో జడ్పీటిసి స్థానాలను సొంతం చేసుకోవాలని అయా మండలాల్లో అభ్యర్థుల కోసం జల్లెడ పడుతున్నారని టాక్. సిర్పూర్ టీ మండలంలో స్థానికంగా ప్రజాదరణ కలిగిన ఆరె సామాజిక వర్గానికి చెందిన ఓ యువకుడిని జడ్పిటిసిగా బరిలోకి దింపాలని చూస్తున్నారని విశ్వసనీయ సమాచారం. ఈ విషయమై వచ్చే వారంలో ‘మరాఠా మహా సంఘ్’ కమిటీని సైతం నియమించి గ్రౌండ్ వర్క్ చేయనుందని వినికిడి. అయితే, సిర్పూర్‌కు చెందిన సదరు యువకుడు ఎవరు? అనేది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది.