- బీసీ సంఘం రాష్ట్ర నాయకులు, నర్సంపేట నియోజకవర్గ ఇన్ చార్జి శ్రీనివాస్
వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి/నర్సంపేట:
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లను పెంచిన తర్వాతనే ఎన్నికల నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తున్నట్లు బీసీ సంఘం రాష్ట్ర నాయకులు, నర్సంపేట నియోజకవర్గ ఇన్ చార్జి శ్రీనివాస్ డ్యాగల తెలిపారు. బుధవారం ఆయన నర్సంపేట పట్టణంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 22 శాతం నుండి 42 శాతానికి పెంచుతామని బీసీ డిక్లరేషన్ లో పొందుపరిచారని గుర్తుచేశారు.
ఆ పొందుపరిచిన ప్రకారం రిజర్వేషన్లను రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతానికి పెంచిన తర్వాతనే..స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. రిజర్వేషన్లపై స్పష్టత లేకుండా స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించ వద్దని రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తున్నట్లు స్పష్టం చేశారు.
రిజర్వేషన్లు పెంచడం వల్ల రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలైన పంచాయతీ, మున్సిపాలిటీ లలో బీసీల దామాషా ప్రకారం బీసీలకు ప్రాతినిథ్యం లభిస్తుందని శ్రీనివాస్ వివరించారు. కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు ఓడపెల్లి రమేష్, మద్దెల కొమురయ్య, బేతి భాస్కర్, మద్దెల శ్యామ్, మర్రి క్రాంతి కుమార్, ఓడపెల్లి గోవర్ధన్, శీరంశెట్టి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.