•  నర్సంపేట నియోజకవర్గంలోని వివిధ మండలాల నాయకులూ జనసేన పార్టీకి రిజైన్

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి/నర్సంపేట:
జనసేన పార్టీకి నర్సంపేట నియోజకవర్గ ఇన్ చార్జి మెరుగు శివ కోటి యాదవ్, నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల నాయకులు రాజీనామా చేశారు. ఈ మేరకు నాయకులతో కలిసి మెరుగు శివకోటి శనివారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. తెలంగాణ జనసేన పార్టీ రాష్ట్ర అధినాయకత్వం ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో అవలంభించిన వ్యవహార శైలి, వారి తప్పిదం వల్ల సంభవించిన పరిణామాలు, పలు ప్రత్యేక కారణాల వల్ల తాను పార్టీకి రాజీనామా చేసినట్లు శివకోటి తెలిపారు.

తన వ్యక్తిగత జీవితంలో స్వామి వివేకానందుని బోధనలు ఎంతో స్ఫూర్తిని నింపి సమాజానికి..తన వంతు సేవ చేయాలని ప్రేరణ కల్పిస్తే, ఆ వివేకానందుని బోధనలను ఆచరిస్తూ నేటి సమాజంలో తనకు కనిపించిన గొప్ప వ్యక్తి పవన్ కల్యాణ్ అని చెప్పారు. పవన్ కల్యాణ్ వ్యక్తిత్వానికి అభిమానిగా మారి, ఆయనకు అండగా నిలవాలని పార్టీ సిద్ధాంతాలు నచ్చి ప్రజా సేవే లక్ష్యంగా జనసేనలో చేరి ఒక కార్యకర్తగా పనులు ప్రారంభించానని గుర్తుచేసుకున్నారు.

నర్సంపేట నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం జనసైనికులు అందించిన సేవలు స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. తనకు రాజకీయ అవకాశం కల్పించిన జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ కు, తనను ఆదరించిన ప్రజలకు, ప్రోత్సహించిన ఆత్మీయులకు, మీడియా సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నా ప్రజాసేవ మరువనని వెల్లడించారు.

ఇన్నేళ్లు తనతో నడిచిన జన సైనికులకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ప్రజలకు తాము అవసరం అనుకుంటే సరైన సమయంలో ప్రజాసేవే లక్ష్యంగా జనానికి భరోసా కల్పించే, తమ ఆలోచనలకు దగ్గరగా ఉన్న నూతన రాజకీయ వేదిక ద్వారా తమ ప్రయాణం ఉండబోతోందని పేర్కొన్నారు.

పార్టీకి తమ రాజీనామా నిర్ణయం అన్ని కోణాల్లో ఆలోచించి తనతో కలిసి పని చేసిన అనేక మంది కార్యకర్తలతో చర్చించాకనే తీసుకున్నామని తెలిపారు. ఇప్పటి వరకు తనకు తోడుగా నిలిచిన జనసైనికులకు ఏ కష్టం వచ్చి తన వద్దకు వచ్చిన అందుబాటులో ఉంటానని తెలిపారు.

జన సేన అధినేత పవన్ కల్యాణ్ స్ఫూర్తితో నర్సంపేట నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఒక కార్యకర్త గా జనసేన పార్టీ జెండా చేపట్టి అనేక సామాజిక, ప్రజా సేవా కార్యక్రమాలు ద్వారా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లినట్లు వివరించారు. అనేక ప్రజా సమస్యలపై స్పందించి పార్టీ బలోపేతం కోసం కృషి చేసినట్లు చెప్పారు. జనసేన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు, రాజీనామా లేఖను అధ్యక్షులు పవన్ కళ్యాణ్., కేంద్ర కార్యాలయానికి పంపించినట్లు తెలిపారు.

శివకోటి బాటలో నర్సంపేట నియోజవర్గంలోని ఆరు మండలాలకి చెందిన ముఖ్య నాయకులు వంగ మధు, ఓర్సు రాజేందర్, కుండే రాజ్ కుమార్, గంగుల రంజిత్, సుధగాని ప్రదీప్, భీముడు సందీప్ రెడ్డి, గాండ్ల అరుణ్, ఎల బోయిన డేవిడ్, షేక్ హుస్సేన్, రాసమల్ల పవన్ కళ్యాణ్, బొబ్బ పృథ్వి, కొలువుల కార్తీక్, ఉడుగుల క్రాంతి, కొమ్మ బిరాన్, అందే రంజిత్, రాపోలు సురేష్, టేకుల రవి, పోషాల కార్తీక్, గద్దల కిరణ్, మిలాన్, వీర మహిళలు కోల మౌనిక, లహరి తదితరులు తమ పదవులకు, జనసేన పార్టీకి రాజీనామా చేశారని శివకోటి తెలిపారు.