వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ఆధ్యర్యంలో ది నేషనల్ కన్జూమర్ రైట్స్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్ పర్సన్ డాక్టర్ అనితా రెడ్డి హన్మకొండ లోని స్పందన మానసిక దివ్యాంగుల ఆశ్రమంలో సంక్రాంతి సంబురాలు నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఈ సంబురాలు ప్రారంభించారు. పిల్లలు హరిదాసు, సోదెమ్మ వేషధారులై అలరించారు. భోగిమంటలు వేసి, పతంగులు ఎగురువేసి, బొమ్మలకొలువు పెట్టి, చక్కని రంగవళ్లులు వేసి ఆట పాటలతో ఉత్సవాల్లో పాల్గొన్నారు. పిల్లలకు భోగి పల్లు పోసి అనితా రెడ్డి పిల్లలతో పాటు సందడి చేశారు.
‘‘ముందే వచ్చిందా సంక్రాంతి’’ అన్నట్లు ఈ వేడుక సాగింది. ఈ సందర్భంగా డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ పండుగ అంటే మనం మాత్రమే సంతోషంగా ఉండటం కాదని, పది మందిని కలుపుకుని, పదిమందికి ఆనందాన్ని పెంచడమే నిజమైన పండుగ అని స్పష్టం చేశారు. సహజంగా ఉండే పిల్లలతో ఎవరైనా ఏ వేడుక అయినా జరుపుకుంటారని, ఇలా కల్మషము ఎరుగని మానసిక దివ్యాంగులకు పండుగ సంతోషం పంచాలనే ఇక్కడ ఈ వేడుక జరిపామని వివరించారు. ఈ పిల్లల ఆనందము చూసాక ఎంతో సంతృప్తి కలిగిందని వెల్లడించారు.
పిల్లలకు మన సంస్కృతి సంప్రదాయాల పండుగల గురించి తెలియ చేయాలని ఇక్కడ ఫెస్టివల్ జరిపామని తెలిపారు. ఈ పిల్లలకు ప్రేమ, ఆప్యాయతలే మందులని పేర్కొన్నారు. మానసిక దివ్యాంగుల సేవ విశ్వమానవ సేవ అని డాక్టర్ అనితా రెడ్డి అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ అనితా రెడ్డి, సుచరిత, రాజేందర్ రెడ్డి, సుష్మా, కరుకాల ఆర్విక, వసుధ, హరిత తదితరులు పాల్గొన్నారు.