వేద న్యూస్, డెస్క్ : 

సంక్రాంతి అంటే నగరంలో పతంగులే గుర్తుకు వస్తాయి. ఈ పండగకు వారంరోజుల ముందు నుంచే చిన్నా, పెద్దా అన్న తారతమ్యం లేకుండా గాలిపటాలను ఎగరవేసేందుకు ఆసక్తి చూపిస్తారు. గతంలో ఈ పతంగులను ఎగరేసేందుకు కాటన్‌ మాంజాను వాడేవారు. పోటీ పెరగడంతో మాంజా దారానికి గాజు పిండి,సగ్గుబియ్యం,గంధకం, రంగులు వేసి మాంజాను తయారు చేసేవారు. కానీ ప్రస్తుతం మార్కెట్‌లో ప్రమాదకరమైన‘చైనా మాంజా’ రాజ్యమేలుతోంది.

రసాయనాలు పూసిన ఈ మాంజాతో పక్షులు, మనుషులకు కూడా ముప్పు వాటిల్లుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం 11 జూలై 2017న నిషేధం విధించింది. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం 

చైనా మాంజా అమ్మినా, కొనుగోలు చేసినా నేరం కింద పరిగణలోకి తీసుకొని అమ్మితే ఏడేళ్ల జైలు, రూ.10 వేల జరిమానా విధిస్తారు. 

అయితే ఆరేండ్ల క్రితం నిషేధ చట్టం చేసినా ఇప్పటికీ నగర మార్కెట్‌లో చైనా మాంజా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కాగా సంబంధిత అధికారులు ఈ చైనా మాంజా అమ్మకాల పై దృష్టి పెట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. అలా కాకుండా సంబంధిత అధికారులు, పాలకులు చూసి చూడనట్టు వ్యవహరిస్తే చైనా మాంజా వాడకం అటు జంతువులు పక్షులతో పాటు మనుషుల ప్రాణాలకు సైతం ముప్పు వాటిల్లుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.