• ప్రారంభించిన ఈటల రాజేందర్, జేఎస్ఆర్

వేద న్యూస్, కొత్తకొండ/ఎల్కతుర్తి:
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ లో “వృక్ష ప్రసాద పంపిణీ” కార్యక్రమాన్ని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ సోమవారం ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,వృక్ష ప్రసాద దాత జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి (జే ఎస్ ఆర్)తో కలిసి ప్రారంభించారు.

కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయ ఆవరణలో గత ఏడు సంవత్సరాలుగా పంపిణీ చేస్తున్న విధంగానే.. ఈ సంవత్సరం కూడా “వృక్ష ప్రసాదం” పేరు తో పండ్ల మొక్కల పంపిణీ చేస్తున్నట్లు సురేందర్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు.

గతంలో ఎన్ని అడ్డంకులు సృష్టించిన వీరభద్రస్వామి ఆశీస్సులతో కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు.ఈ సంవత్సరం కూడా మూడు రకాల పండ్ల మొక్కలను పంపిణీ చేస్తున్నట్లు వారు స్పష్టం చేశారు.
మొక్కలతో పాటు పర్యావరణం పరిరక్షణలో భాగంగా బ్యాగ్ ను సైతం అందజేస్తామన్నారు.

భక్తులు వీరభద్ర స్వామి స్వరూపంగా మొక్కలను తీసుకొని వాటిని పెంచాలని కోరారు. వృక్ష ప్రసాదం కార్యక్రమం ద్వారా భవిష్యత్తు తరాలకు దైవభక్తితో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం స్వచ్ఛమైన పండ్లను వారికి అందించాలని ఉద్దేశం తో ఈ కార్యక్రమాన్ని తాను ప్రారంభించినట్లు జేఎస్ఆర్ వెల్లడించారు. ఇప్పటివరకు దాదాపు నాలుగు లక్షల పండ్ల మొక్కలను భక్తులకు ప్రసాదం రూపంలో అందించామని వివరించారు.