వేద న్యూస్, వరంగల్/ఎంజీఎం సెంటర్:
దగ్గరకొస్తున్న సర్కారు విధించిన గడవు
ఆ లోపు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం పూర్తయ్యేనా?
చారిత్రక నగరిగా పేరు పొందిన ఓరుగల్లు నగరంలో అధునాతమైన వైద్యసేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం
ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అనుకున్న సమయానికి అందుబాటులోకి వచ్చే పరిస్థితులు కనబడుట లేదని చెప్పొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కోసం 56.39 ఎకరాలు కేటాయించి రూ.1,116 కోట్లతో ఆస్పత్రి నిర్మాణం చేపట్టింది. దేశంలోనే అతిపెద్ద ఆస్పత్రి గా ఈ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిలువబోతుండడం విశేషం. అయితే, ఇందులో సుమారు 42.42 ఎకరాల విస్తీర్ణంలో మొదట రెండు వేల పడకల సామర్థ్యంతో 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ నిర్మాణానికి రహదారులు, భవనాల (ఆర్‌అండ్‌బీ) శాఖ ఇంజినీర్లు డిజైన్ చేశారు. టెండర్ల ప్రక్రియలో నిర్మాణ పనులను ఈపీసీ మోడ్‌లో ఎల్‌అండ్‌టీ సంస్థ దక్కించుకున్నది. 18 నెలల కాల పరిమితితో నిర్మాణ పనులను పూర్తి చేయడానికి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నది. అంటే 2023 నవంబర్ 8లోగా పూర్తి చేసే లక్ష్యంతో ఎల్‌అండ్‌టీ సంస్థ నిర్మాణ పనులను ప్రారంభించింది. దసరాలోగా నిర్మాణ పనులను పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు నిర్మాణ పనులపై ఉన్నతస్థాయి సమీక్ష జరుపుతూ సూచనలు చేస్తూనే ఉన్నారు. అందుకు ఇంకా దాదాపుగా నెల రోజుల సమయమే ఉంది. ఆ లోపు రోగులకు సేవలు అందుబాటులోకి వచ్చేలా ఆస్పత్రి నిర్మాణం పూర్తి కావడం కష్టమేనని తెలుస్తోంది. 24 అంతస్తుల ఆస్పత్రి భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయనే పలువురు పేర్కొంటున్నారు. కానీ, నిర్మాణ పనులు చేసే సంస్థ కొంత కాలం నుంచి వేగవంతంగా పనులపైన దృష్టి సారించడం లేదని పలువురు విమర్శిస్తున్నారు.
దసరా నాటికి డెడ్ లైన్ పెట్టినా, పలు సందర్భాల్లో ప్రభుత్వం ప్రకటనలు చేసినప్పటికీ వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనుల పట్ల కావాలనే నిర్లక్ష్యం వహిస్తున్నారా? అనే అనుమానాలూ పలువురు వ్యక్తపరుస్తున్నారు. చూడాలి మరి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి దసరా నాటికి ప్రారంభం అవుతుందో..లేదో..?