వేద న్యూస్, వరంగల్ :

బాల్య దశ నుండే ఆడపిల్లలను అన్ని రంగాల్లో ప్రోత్సహించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేలా అంకుటిత దీక్షతో పనిచేయాలని ఇందుకుగాను సంబంధిత అధికారుల సమన్వయం చాలా అవసరమని వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి తెలిపారు.

బుధవారం వరంగల్ ఎంజీఎం మట్టేవాడ పద్మశాలి ఫంక్షన్ హాల్ నందు జిల్లా మహిళా శ్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా బాలల పరిరక్షణ కమిటీ సంబంధిత పోలీస్, విద్య, ఆరోగ్య, పంచాయతీ, క్రీడల వివిధ శాఖల అధికారుల సమన్వయంతో జాతీయ బాలిక దినోత్సవం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా జాతీయ బాలిక దినోత్సవం ఉద్దేశించి జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి మాట్లాడుతూ బాలికా సాధికారత , వారి హక్కుల కోసం సమయానుకూలంగా ఫిర్యాదు చేసే విధానంపై బాలికలకు అవగాహన ఎంతో అవసరమని చెప్పారు.

జిల్లాలో బాల్యవివాహాలను రూపుమాపడానికి జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సంబంధిత అధికారుల సమన్వయంతో వారు తీసుకుంటున్న చర్యలను కొనియాడారు. లింగ వివక్షకపై తల్లితండ్రులు ఆలోచన సరళి మారితేనే సమాజంలో ఆడ మగ అనే లింగ బేధం మార్పు వస్తుందన్నారు. దేశం మొత్తం బాలికల అభ్యున్నతికి ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు సఫలీకృతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

జిల్లా సంక్షేమ అధికారి శారద మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జనవరి 24న భారతదేశం జాతీయ బాలిక దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని. మన సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరిస్తూ బాలురు, బాలికల మధ్య అసమానతలను దూరంచేసేలా ప్రజల్లో అవగాహన కలిగించేందుకు జరుపుతున్నదే ఈ ప్రత్యేక దినోత్సవమని చెప్పారు.

మహిళా, శిశు సంక్షేమ శాఖ, బాలికా సాధికారతపై హక్కులు, విద్య, ఆరోగ్యం, పోషకాహారం వంటి అంశాలపై అవగాహన కలిగిస్తూ..బాలికలను ముందుకు నడిపించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. విద్యార్థులు గొప్ప ఆశయంతో చదవాలని, బాలురకు దీటుగా బాలికలు అన్ని రంగాలు రాణించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయిలో నిర్వహించిన ఆటల పోటీలలో గెలిచిన 36 మందిపిల్లలకి బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. బాల్య వివాహ రహిత 13 గ్రామపంచాయతీలలోని సర్పంచులకు, పంచాయతీ సెక్రటరీలకు, అంగన్వాడి టీచర్లకు మొత్తం 39 మందికి సన్మానం నిర్వహించడం జరిగింది.

అకాడమిక్స్ లో మరియు క్రీడల విభాగంలో ప్రతిభ కనబరిచిన పదిమంది విద్యార్థినిలకు సీసీఐ లలోని నలుగురు విద్యార్థినులకు మరియు జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా అద్భుత ప్రదర్శనకు ఆరుగురు విద్యార్థినిలకు మొమెంటో మరియు శాలువాలతో సన్మానం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో డిపిఓ కల్పన , డివైఎస్ఓ సత్యవాణి , డి ఆర్ డి ఓ డి పి ఎం భవాని, సిడిపిఓలు, జిల్లా మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ పావని, సఖి అడ్మిన్,స్కూల్ ప్రిన్సిపల్స్ పీఈటీస్ డి సి పి యు విభాగం, సి డబ్ల్యూ సి, చైల్డ్ లైన్ విభాగం,జెండర్, ఈక్విటీ కోఆర్డినేటర్ ఫ్లోరెన్స్ ,పోలీస్ విభాగం, సూపర్వైజర్లు అంగన్వాడీ టీచర్లు, విద్యార్థినిలు, మహిళా సాధికారత కేంద్రం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.