వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తాసుబెల్లి ఫౌండేషన్ చైర్మన్ శంకర్ నాయుడు ఆధ్వర్యంలో తాసుబెల్లి ఫౌండేషన్ 25వ వార్షికోత్సవం ( సిల్వర్ జూబ్లీ ) వేడుకల సందర్భంగా సమాజంలో రక్తదానం పై అత్యున్నతమైన సేవలందిస్తున్న రక్తదాత సేవామూర్తులకు పురస్కారాలు సోమవారం అందజేశారు.

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, ఒరిస్సా 4 రాష్ట్రాలలో రక్తం దొరకకుండా ఎవరూ చనిపోకూడదని, రక్తదానం చైతన్య కార్యక్రమాలు రక్తదానంపై అవగాహన కార్యక్రమాలు , రక్తదానం చేస్తున్న 109 మంది రక్తదాత సేవ మూర్తులకు , విశాఖపట్నంలో ‘‘భారత సేవ రత్న పురస్కారం – 2024’’ అందజేశారు. గత 19 సంవత్సరాలుగా రక్తదానం కార్యక్రమాలు నిర్వహిస్తున్న బ్లడ్ డోనర్ అండ్ బ్లడ్ మోటివేటర్, వరంగల్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న కన్నె రాజు( స్విమ్మర్ రాజు )కు అవార్డు ప్రదానం చేశారు.

వరంగల్ జిల్లా ఖానాపురం మండలం రాగంపేట గ్రామానికి చెందిన కన్నె కుమారస్వామి-రామనీల దంపతులు పెద్ద కుమారుడు రాజు గత 19 సంవత్సరలుగా అంటే 2005 నుండి సామాజిక సేవ కార్యక్రమలు చేపడుతున్నారు. 2009 నుండి పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ , ఫ్రెండ్లీ పోలీస్ లో భాగంగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.

రక్తదాన చైతన్య యుద్ధంలో ‘‘నేను సైతం’’ అంటూ రాజు 33 సార్లు రక్తదానం చేశారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం 53 రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. అత్యవసర సమయంలో చికిత్స పొందుతున్న 17,064 మందికి ఉచితంగా రక్తం అందజేశారు.కరోనా మహమ్మారి కోరలు సాచి కబళిస్తున్న కరోనా ( కోవిడ్ -19 ) కష్టకాలములో తన ప్రాణాలు సైతం లెక్కచేయకుండా..కరోనా ( కోవిడ్ – 19 ) పేషెంట్లకు అవసరమైన సహాయ సహకారాలు అందించారు.

బాధితులకు అవసరమైన రక్తము, 235 మందికి ప్లాస్మాదానం, నిత్యావసర వస్తువులు, మెడిసిన్స్, మాస్కులు, కరోనా ( కోవిడ -19) వ్యాధి సమయంలో కరోనా రాకుండా అవగాహన కల్పించారు. తాసుబెల్లి ఫౌండేషన్ చైర్మన్ శంకర్ నాయుడు , వెంకటలక్ష్మి, కళావతి చేతుల మీదుగా పురస్కారం అందుకున్నందుకు సంతోషంగా ఉందని రాజు వెల్లడించారు.

తనకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న తన ఉపాధ్యాయులకు, వరంగల్ పోలీస్ డిపార్ట్ మెంట్ అధికారులకు, యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ సభ్యులకు, రక్తదాతలకు, తన మిత్రులందరికీ రాజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.