ఒక అర్జెంట్ పని నిమిత్తం ఒక మహిళ దూరప్రాంతానికి వెళ్లొస్తుంది. ఆ ప్రాంతానికి చేరుకునేందుకు తెల్లవారు జామునే ఆమె బయల్దేరింది. అక్కడ కలవాల్సిన వారిని కలిసి పని విషయమై మాట్లాడింది. అయితే, పని త్వరగా పూర్తి చేసుకోవాలనే ఆరాటంలో సమయం గురించి పట్టించుకోలేదు. అలా కాస్త ఆలస్యం అక్కడే అయింది. పని ఇక పూర్తవుతుందనే నమ్మకంతో బయల్దేరింది. కానీ, అప్పటికే పొద్దు పోయింది. దాంతో చేసేది ఏమీ లేక సదరు మహిళ తన వాళ్లు అనుకున్న ఒక చోట ఒకరి ఇంట్లో ఉండి మరుసటి రోజు బయల్దేరాలని నిశ్చయించుకుంది. ఈ క్రమంలో అక్కడి పరిస్థితులు ఆమెను కొంత సందేహం కలిగించడంతో పాటు భయాన్ని కలిగింపజేసేలా ఉన్నాయి. వెంటనే తేరుకున్న అక్కడున్న ఇంటిలోని పరికరాలను వస్తువులను ‘‘ఆయుధాలు’’గా రక్షణ నిమిత్తం మార్చుకుంది. అలా ఒక మహిళ తనకు తానుగా ‘‘ఆయుధాలు’’ సమకూర్చుకోగా, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారతదేశ పౌరులకు మన భారత రాజ్యాంగం ఇచ్చిన గొప్ప ‘‘వజ్రాయుధం’’ ఓటు హక్కు.
రాజ్యాంగ పరిషత్ సభ్యులు, మేధావులు ప్రజలందరికీ కుల, మత, ప్రాంత, జాతి, లింగ, ధనిక, పేద అనే భేదాలు లేకుండా ఓటు హక్కు అందరికీ ప్రసాదించారు. తద్వారా తమకు ఇష్టమైన, సమర్థుడైన నాయకుడిని ఎన్నుకునే అవకాశం ప్రజలకు ఉంటుందని భావించారు. కాలక్రమంలో ఓటు హక్కు వయస్సును 21 నుంచి 18 ఏండ్లకు తగ్గించారు. ఓటు ప్రక్రియలో ప్రజలందరినీ భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు అవగాహనా కార్యక్రమాలూ చేపడుతున్నాయి.
ఎంతో గొప్పగా ప్రజలందరికీ సమానంగా ఎలాంటి వివక్ష లేకుండా మన రాజ్యాంగం అందించిన ఓటు హక్కు ఇప్పుడు స్వార్థ రాజకీయాలకు అస్త్రంగా మారిపోయి అంగడి సరుకైందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఓట్ల పండుగ వచ్చిందంటే చాలు..బేరసారాలు షరామామూలు అయిపోయాయి.
రాజకీయ నాయకులు తమ పదవుల పందేరంలో ఎత్తులు చేరుకునేందుకు ఓటర్లను పావులుగా వాడుకుంటున్న సందర్భాలు మనం కండ్లారా చూడొచ్చు. అయితే, ప్రజల్లో ఇంకా విస్తృతస్థాయిలో ఓటు గురించిన అవగాహన రావాల్సిన అవసరం ఉంది. నాణ్యమైన విద్య, వైద్యం ఉచితంగా అందిన సమాజంలో ప్రజల జీవన విధానాల్లో మార్పు తప్పనిసరిగా ఉంటుంది. అలాంటి గొప్ప సమాజం ఏర్పడాలంటే ప్రజలు ఇలాంటి సౌకర్యాలను ఎన్నికల డిమాండ్ గా ముందుంచాలి. తమ ఇంటికి ఓటు వేయండని వచ్చిన నాయకుడిని నాణ్యమైన విద్య, వైద్యం అందించాలనే హామీని ఇవ్వాలని, ఆచరణలో అమలు చేసి చూపించాలని కోరే పరిస్థితులు ఏర్పడాలి. అప్పుడే ప్రజా పాలన దిశగా అడుగులు పడతాయి.
ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారతంలో ఓటు విలువను తెలిపేందుకు, దాని ప్రాముఖ్యతను
జనానికి వివరించేందుకు ఎన్నికల సంఘం ఏటా జనవరి 25న ‘‘ఓటరు దినోత్సవాన్ని’’ నిర్వహిస్తోంది. ‘‘ప్రజాస్వామ్యం సామాన్యులకు అందకపోతే వారే ఆ వ్యవస్థను కూల్చేస్తారు’’ అని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నవంబర్ 26, 1949న రాజ్యాంగ పరిషత్ కు భారత రాజ్యంగాన్ని సమర్పిస్తూ చెప్పారు.
మెరుగైన పాలన, మంచి సమాజం మన చేతుల్లోనే ఉందనే సంగతి ప్రజలు గ్రహించాలనే ఉద్దేశంతో రాజ్యాంగ నిర్మాతలు ఇచ్చిన గొప్ప ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. ప్రలోభాలకు లొంగకుండా మెరుగైన సమాజ నిర్మాణానికి తమ వంతు తోడ్పాటు అందించాలి. ఓటు అనే తూటాతో అవినీతిపరుల అంతు తేల్చాలి. తమ చేతిలో ఉన్న ‘‘వజ్రాయుధం’’ ఓటు హక్కు అని గ్రహించి..అది అమ్ముడుపోయేది కాదని మాటల్లో చెప్పడమే కాకుండా చేతల్లో చేసి చూపించాలి. ప్రజాస్వామ్యాన్ని పరిక్షించాలి.
– అంబీరు శ్రీకాంత్, జర్నలిస్ట్, సెల్:81859 68059.