- దేశ మాజీ ప్రధాన మంత్రి నరసింహారావుకు భారతరత్న రావడం పట్ల హర్షం
వేద న్యూస్, హుస్నాబాద్:
మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు భారత దేశ కీర్తి ప్రతిష్టలను ఉన్నత స్థాయికి చేర్చారని మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి లక్ష్మి కాంతారావు, హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్ అన్నారు. భారత ప్రభుత్వం పీవీ నరసింహారావు కు భారతరత్న ప్రకటించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ పీవీ బహుభాషా కోవిదుడని, గొప్ప పరిపాలన దక్షుడని శాసనసభ్యునిగా, పార్లమెంటు సభ్యునిగా ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా ప్రధానమంత్రిగా ఎన్నో పదవులను నిర్వహించాలని పదవులకు వన్నె తెచ్చారని, మచ్చలేని జీవితాన్ని గడిపారని ప్రశంసించారు. నాడు మైనారిటీ ప్రభుత్వాన్ని ఐదేళ్లపాటు నడిపి తన రాజకీయ చాణక్యత ప్రదర్శించారని అన్నారు.
నాడు అప్పుల ఊబిలో కూరుకుపోయిన భారతదేశాన్ని తన ఆర్థిక సంస్కరణలతో అభివృద్ధి విషయంలో పరుగులు పెట్టించారని గుర్తుచేశారు. నాడు పీవీ తీసుకున్న నిర్ణయాల వల్లనే నేడు అభివృద్ధి సాధ్యం అవుతోందని వెల్లడించారు. పీవీ తీసుకున్న నిర్ణయాల ఫలితంగా నేడు భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి విషయంలో దూసుకు పోతోందని, సరళీకృత ఆర్థిక విధానాలు ప్రవేశ పెట్టడం ద్వారా పారిశ్రామిక రంగంలో ఎన్నో పెట్టుబడులు వచ్చాయని, తద్వారా కోట్లాదిమందికి ఉపాధి అవకాశాలు వచ్చాయని స్పష్టం చేశారు.
పీవీ లేని ఆధునిక భారతదేశాన్ని మనం ఊహించుకోలేమని పేర్కొన్నారు. పీవీకి తమ కుటుంబంతో ఎంతో అనుబంధం ఉందని పేర్కొన్నారు. ఆయన స్వగ్రామం భీమదేవరపల్లి మండలం వంగర నాడు హుజురాబాద్, నేడు హుస్నాబాద్ నియోజకవర్గం లో ఉండటం, పీవీ మన ప్రాంత ముద్దుబిడ్డ కావడం మనందరికీ గర్వకారణమని తెలిపారు. ఇది మొత్తం ప్రపంచమే గర్వించదగ్గ నేత అని కొనియాడారు. పీవీకి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వడం పట్ల నేతలు లక్ష్మీకాంతరావు, సతీశ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.