వేద న్యూస్, రాయపర్తి :
ట్రిబ్ ఆగమేఘాల మీద గురుకుల పోస్టుల భర్తీ చేపట్టడంపై ప్రభుత్వ గురుకుల ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు.
ట్రిబ్ ద్వారా నియామకాలు చేపట్టడాన్ని నిరసిస్తూ, తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురుకులాల్లోని అన్ని సంఘాలు కలిసి ఇటీవల కార్యాచరణను ప్రకటించాయి.
సోమవారం వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రం లోని సాంఘిక సంక్షేమ గురుకులం ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రమోషన్లు, బదిలీలు పూర్తిచేసిన తరువాతే నియామక ప్రక్రియను చేపట్టాలని డిమాండ్ చేశారు.అయితే రాష్ట్రంలో వెయ్యికిపైగా ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, పీజీ కాలేజీలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ యాజమాన్యాల కింద కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇతర (జనరల్, బీసీ, మైనార్టీ) గురుకులాల్లో 2018, 2019లో ఉద్యోగంలో చేరిన వారికి కూడా పదోన్నతులు లభించాయి.
అయితే ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని సాంఘిక సంక్షేమ గురుకులాల్లోని ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఉద్యోగులకు చాలాకాలంగా ప్రమోషన్లు లభించలేదు.బదిలీలు చేపట్టకపోవడంతో ఏండ్ల తరబడి మారుమూల ప్రాంతాల్లోని గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్నారు. కొత్తగా నియామకాలు పొందేవారు విధుల్లో చేరితే దీర్ఘకాలంగా మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్నవారు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మెరుగైన ప్రాంతాలను కోల్పోనున్నారు.
అంతేకాకుండా సుదీర్ఘ సర్వీస్ కలిగిన సీనియర్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఉద్యోగులు రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా కొత్తగా నియామకం పొందనున్న వారికంటే జూనియర్‌గా పరిగణన పొందే ప్రమాదం ఉన్నది. దీనితోపాటు 317 జీవోకు సంబంధించిన సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. ఆయా సమస్యలను పరిష్కరించకుండా, ప్రమోషన్లు, బదిలీలు చేపట్టకుండా ప్రభుత్వం ఇప్పుడు ట్రిబ్ ద్వారా కొత్త నియామకాలు చేపట్టడంపై గురుకుల ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.