• బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం

వేద న్యూస్, హైదరాబాద్:
సమగ్ర కుల గణన తీర్మానాన్ని శాసన సభ ఏక్రీవంగా ఆమోదించిన ఈరోజు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో చారిత్రాత్మక దినమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభివర్ణించారు. కుల గణన తీర్మానానికి ఏకగ్రీవంగా మద్దతు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకి, సహచర మంత్రులకు, వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్ లకు, ఎమ్మెల్యేలకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం ధన్యవాదాలు తెలిపారు.

డోర్ టూ డోర్ కుల గణన కు యావత్ కాంగ్రెస్ పార్టీ వెన్నుదన్నుగా నిలుస్తుండటం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా కుల గణన చేపట్టాలని, ‘‘జిత్నా హిస్సేదారి ఉత్నా భాగీదారి’’ అని తమ నాయకుడు రాహుల్ గాంధీ పిలుపునకు అనుగుణంగా రాష్ట్రం లో కుల గణనకు శ్రీకారం చుట్టడం..ఆ తీర్మానాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గా శాసన సభ లో ప్రవేశ పెట్టడం తో తన జీవితం దన్యమైందని మంత్రి పొన్నం సంతోషం వ్యక్తం చేశారు.

ఇచ్చిన హామీ మేరకు తమ ప్రభుత్వం డోర్ టూ డోర్ సమగ్ర కుల గణన చేపడుతోందని చెప్పారు. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ కి, ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ కి , ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కి , ప్రియాంక గాంధీ కి , ఏఐసిసి తెలంగాణ ఇన్ చార్జి దీపాదాస్ మున్షీ లకి మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ మనిషి జబ్బును తెలుసుకునేందుకు ఏ రకంగా నైతే ఎక్స్ రే ఉపయోగపడుతుందో..సమగ్ర కుల గణన సైతం సమాజంలోని కులాల స్థితి గతులను తెలియజెప్పుతుందని కాంగ్రెస్ నాయకత్వం మొదటి నుండి చెప్తూ వస్తుందని గుర్తుచేశారు.

దశాబ్దాలుగా వెనుకబడిన తరగతులు సామాజిక, విద్య , ఉద్యోగ ,రాజకీయాల్లో వెనుకబాటుకు గురవుతుండడం అత్యధిక సంఖ్యలో జనాభా ఉన్నప్పటికీ సరైన న్యాయం జరగడం లేదని కాంగ్రెస్ పార్టీ భావించిందని తెలిపారు. దీంతో దేశ వ్యాప్తంగా వెనుకబడిన తరగతుల కుల గణన చేయాలని కాంగ్రెస్ పార్టీ తీర్మానించిందని స్పష్టం చేశారు. అందులో భాగంగా తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టో లో పెట్టిన విధంగా ‘‘డోర్ టూ డోర్ సమగ్ర కుల గణన’’కు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

ఈ కుల గణన కాంగ్రెస్ సామాజిక న్యాయ సూత్రం ప్రకారం..సమాజంలో అట్టడుగు బడుగు బలహీన వర్గాలు, దళిత, గిరిజన, మైనారిటీ,బీసీ వర్గాల్లో జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకొస్తుందనీ విశ్వాసం వ్యక్తం చేశారు.ఏకగ్రీవంగా ‘‘డోర్ టూ డోర్ కుల గణన’’ తీర్మానాన్ని ఆమోదించిన తెలంగాణ అసెంబ్లీకి..మద్దతు ఇచ్చిన ప్రజా సంఘాలు, బీసీ నేతలు, మేధావి వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృత్ఞతలు తెలుపుతున్నదని మంత్రి పొన్నం వివరించారు.