వేద న్యూస్, సుల్తానాబాద్:
ప్రజలకు అందుబాటులో ఉంటూ ఫిర్యాదులపై తక్షణమే స్పందించి న్యాయం జరిగేలా కృషి చేయాలని పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ అధికారులకు సూచించారు. శనివారం ఆయన సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన ఏసీపీ రికార్డులు తనిఖీ చేశారు. స్టేషన్ నిర్వహణ, పోలీసుల పనితీరు, పరిసరాలు పరిశీలించారు.

ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ లో 5ఎస్ , ఫంక్షన్ వర్టీకల్స్ అమలు అయ్యేటట్లు చూసుకోవాలని, సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకవచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్ లో ఎంత మంది సిబ్బంది ఉన్నారు, వారు ఏ ఏ విధులు నిర్వహిస్తున్నారో వర్టికల్స్ వారిగా వారి విధులు అడిగి తెలుసుకొన్నారు.

శాంతి భద్రతలు చాలా ముఖ్యమని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదన్నారు. చట్ట వ్యతిరేక కార్యక లాపాలపై నిఘా పెట్టాలని సూచించారు. సామజిక మాధ్యమాలలో వచ్చే వదంతులు, అసత్య ప్రచారాలపై గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. అలాగే డ్రగ్స్ నియంత్రించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఏ తరహా నేరాలు ఎక్కువ నమోదవుతున్నాయో వాటి నియంత్రణకై దృష్టి పెట్టాలన్నారు. రాత్రి పెట్రోలింగ్ అధికారులు ముమ్మరం చేయాలని, పాత నేరస్థులను తనిఖీ చేయాలని సూచించారు. అదేవిధంగా విధి నిర్వహణలో రోల్ క్లారిటీ వుండాలని, అప్పగించిన భాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తూ….పోలీసు వ్యవస్థపై మరింత నమ్మకాన్ని పెంచాలని వెల్లడించారు. ఏసీపీ వెంట సుల్తానాబాద్ సిఐ జగదీష్, ఎస్సై వినీత ఉన్నారు.