- దేవునూరులో ఘనంగా ఛత్రపతి జయంతి
వేద న్యూస్, ధర్మసాగర్:
హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం దేవునూర్ గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 394 వ జయంతిని ఆరె కులస్తులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆ గ్రామ ఆరె సంఘం అధ్యక్షులు లింగంపల్లి చిరంజీవి ఆధ్వర్యంలో వేడుకలు జరిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమసమాజ స్వాప్నికుడు శివాజీ మహరాజ్ అని కొనియాడారు. యువతకు స్ఫూర్తి ప్రదాత శివాజీ అని తెలిపారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేలో అరె, అరె మరాఠ, అరే క్షత్రియ అని మూడు విధాలుగా లిఖించిందని తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపట్టబోతున్నదని..ఈ క్రమంలో తాము ఓబీసీ సర్టిఫికెట్ సాధనకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.
అందులో భాగంగా కులగణన ప్రక్రియలో రాష్ట్రంలోని అరె కుల బంధువులందరూ ఒకే పేరు(ఆరె లేదా ఆరెవాళ్లు లేదా ఆరె మరాఠ) సూచించే విధంగా ఆరె సంఘం నాయకులు సూచించాలని దేవునూర్ గ్రామ శాఖ తరఫున విజ్ఞప్తి చేశారు. జయంతి సందర్భంగా ఆరె కులస్తులు గ్రామంలో బైక్ ర్యాలీ తీశారు. జయంతి కార్యక్రమంలో ఆరె సంక్షేమ సంఘం కమిటీ సభ్యులు, నాయకులు, ఆరె కులస్తులు, గ్రామ ప్రజలు, ఛత్రపతి శివాజీ మహరాజ్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.