• రాష్ట్ర మున్నూరు కాపు సంఘాల నాయకుల డిమాండ్

వేద న్యూస్, సోమాజీగూడ:
తెలంగాణ రాష్ట్రంలో అధిక జనాభాగా ఉన్న మున్నూరు కాపులకు ప్రభుత్వం తరఫున ఎలాంటి సహాయ సహకారాలు అందడం లేదని రాష్ట్ర మున్నూరు కాపు సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రప్రభుత్వం మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. శనివారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ రాష్ట్రంలోని మున్నూరు కాపు సంఘాల రాష్ట్ర, జిల్లా, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నాయకుల సమావేశం జరిగింది. మున్నూరు కాపు సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు ఆర్ వీ మహేందర్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండ దేవయ్య పటేల్, నాయకులు ఎడ్ల రవి, బండి సంజీవ్, వనమాల ప్రవీణ్, ఆరె దశరథ్, ఊగే శ్రీను తదితరులు మీటింగ్ లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో, ఉద్యమంలో మున్నూరు కాపులు కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. గత పదేండ్లుగా మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ కోసం ఉద్యమం చేస్తున్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సర్కార్ తమ మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు.

రాబోయే పార్లమెంట్ ఎన్నికల కన్న ముందే మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మున్నూరు కాపు రాష్ట్ర సంఘాల పక్షాన కోరుతున్నట్లు వెల్లడించారు. కార్పొరేషన్ ఏర్పాటులో మున్నూరు కాపు రాష్ట్ర సంఘాల నాయకులకు అవకాశం కల్పించాలని విన్నవించారు. కార్యక్రమంలో నాయకులు ఆర్ వీ మహేందర్ కుమార్, కొండా దేవయ్య పటేల్, రవికుమర్, బండి సంజీవ్, జేవీఆర్ పటేల్, హరి పటేల్, బాలక్రిష్ట, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.