• హుజురాబాద్‌ను ఇక ఆ నేత వదిలినట్లేనా?
  • మారనున్న ఈటల రాజేందర్ ఇలాకా!
  • దేశంలోనే అతి పెద్ద నియోజకవర్గం నుంచి బరిలో రాజేందర్
  • ఇటీవల ఆ స్థానానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాజీనామా
  • మల్కాజ్ గిరి నుంచి లోక్ సభ పోటీలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న బీజేపీ నేత
  • బీజేపీ మల్కాజ్ గిరి లోక్ సభ అభ్యర్థిగా తాజాగా జాబితాలో చోటు దక్కించుకున్న ఈటల రాజేందర్

వేద న్యూస్, కరీంనగర్:

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆ మాటకొస్తే..ఆ‘నాటి’ ఉమ్మడి ఏపీతో పాటు దేశ రాజకీయాల్లో ‘ఈటల రాజేందర్’ ఒక చరిత్ర అని చెప్పొచ్చు. దాదాపు 20 ఏండ్ల పాటు ‘హుజురాబాద్’ నియోజకవర్గం నుంచి శాసన సభ్యులుగా ప్రాతినిథ్యం వహించి సమకాలీన రాజకీయాల్లో తన మార్క్ వేసిన నాయకుడు ఈటల. రాష్ట్ర రాజకీయాల్లో, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమం జరిగిన సమయంలో ఉద్యమ నేతగా, సీజన్డ్ పొలిటీషియన్ గా ప్రత్యేక గుర్తింపు పొందారు.

గులాబీ పార్టీలో ఆ‘నాడు’ అధినేత కేసీఆర్ తర్వాత నెం.2 స్థానంలో ఉన్న ఈటల రాజేందర్..ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ గా పార్టీ వాదనను బలంగా వినిపించారు. ‘ముఖం ఎక్కడ పెట్టుకుంటావ్ రాజేంద్రా’ అంటూ నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఈటలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రజలకు విదితమే. అలా ఆనాటి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో సత్సంబంధాలు కలిన ఈటల రాజేందర్..ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గులాబీ పార్టీలోకి అధికారంలోకి రావడం.. ప్రభుత్వం ఏర్పాటు చక చకా జరిగిపోయాయి. కాలం గిర్రున తిరిగింది.

గులాబీ పార్టీలో లుక లుకలు మొదలయ్యాయి. ‘ఉద్యమ గులాబీ జెండా’కు ఓనర్లు ఎవరన్న వాదన బయలుదేరగా, అప్పుడే సొంత పార్టీపైన తిరుగుబాటు స్వరం వినిపించారు ఈటల రాజేందర్. ఇక ఆ తర్వాత అవినీతి ఆరోపణలు తదితర రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ మారారు. గులాబీ పార్టీ నుంచి బీజేపీ లో చేరి కమలం తరఫున ఉప ఎన్నికల బరిలో నిలిచిన క్రమంలో ఈటల రాజేందర్ ను ఎన్నికల క్షేత్రంలో ఓడించేందుకు నాటి పింక్ సర్కార్ సర్వశక్తులను ఒడ్డింది. రాజ్యం(నాటి రాష్ట్ర ప్రభుత్వం) మొత్తం హుజురాబాద్ లో టార్గెట్ చేసి మరీ ఈటల రాజేందర్ ఓటమికి ప్రయత్నించింది. అయినా ఈటల రాజేందర్ 25 వేల పై చిలుకు మెజారిటీతో బరి గీసి కొట్లాడి..ప్రజల మద్దతుతో గెలుపొందారు. కానీ, గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అనూహ్యంగా ఓటమి చెందారు.

తనను ఇంతగా ఆదరించి..పెంచి పెద్దవాడిని చేసిన హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు 2023 ఎన్నికల్లో ఓడించినా..వారికి అండగా ఉంటానని ఈటల రాజేందర్ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. 2004 నుంచి 2021 వరకు కమలాపూర్, హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు అప్రతిహతంగా ఈటల రాజేందర్ కు పట్టం కడుతూనే వచ్చారు.

ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకున్న ప్రతీ ఒక్కరికి ఈటల రాజేందర్ అనే వ్యక్తి గురించే తెలిసేలా చేసిన..తన ఇలాకా ‘హుజురాబాద్’ ను ఈటల రాజేందర్ మరిచిపోరనేది వాస్తవం. కానీ, ఆయన ఆ స్థానాన్ని వదిలిపెడుతున్నారా? అనే ప్రశ్నకు సమాధానం మాత్రం స్పష్టంగా అవుననే అర్థమవుతోంది. బీజేపీ తాజాగా విడుదల చేసిన లోక్ సభ అభ్యర్థుల జాబితాలో ఈటల రాజేందర్ పేరు ఉంది. మల్కాజ్ గిరి బరిలో బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కాగా, ఇన్నాళ్ల పాటు దాదాపు 20 ఏండ్లుగా ‘హుజురాబాద్’ నియోజకవర్గంతో పెనవేసుకున్న ‘పేగు బంధాన్ని’ ఇక ఆయన తెంచేసుకున్నట్లేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హుజురాబాద్ అంటే ‘ఈటల ఇలాకా’ అనే అభిప్రాయం ఇక ఉండబోదనే పలువురు అంటున్నారు.

‘హుజురాబాద్’ నియోజకవర్గ ప్రజలతో ఈటల అనుబంధం అనిర్వచనీయమనదే. అయినప్పటికీ ప్రజాక్షేత్రంలో ఎన్నికల యుద్ధంలో గెలుపునకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టే మారిన రాజకీయ పరిస్థితులలో దేశంలోనే అతి పెద్ద నియోజకవర్గం అయిన మల్కాజ్ గిరి లోక్ సభ బరిలో ఈటల పోటీకీ ఇక సై అంటున్నారు.

బీజేపీ అధిష్టానం సైతం ఆశీస్సులు అందించింది. దాంతో ఈటల ఇలాకా ఇక హుజురాబాద్ కాదని, భవిష్యత్తులో ‘మల్కాజ్ గిరి’ కావాలని ఆయన అనుయూయులు, వర్గీయులు కోరుకుంటున్నారు. ఇటీవల మల్కాజ్ గిరి స్థానానికి ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాజీనామా చేశారు.

ఈ స్థానం నుంచి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులుగా ఎవరు బరిలోకి నిలుస్తారనేది కూడా కీలకం కానుంది. బీజేపీ తరఫున మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ పేరు లోక్ సభ అభ్యర్థిగా కన్ఫర్మ్ కాగా, ఇక బీజేపీ ఎన్నికల ప్రచారంలో అన్ని రాజకీయ పార్టీల కంటే ముందే దూసుకెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. చూడాలి మరి..సమీప భవిష్యత్తులో ఈటల రాజేందర్ ఇలాకాగా ‘మల్కాజ్ గిరి’ మారుతుందో..లేదో..