బీజేపీ..దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీల్లో బలమైన పార్టీ అని ఆ పార్టీ నేతలు చెప్తుంటారు. క్షేత్రస్థాయిలో పార్టీకి పటిష్ట నిర్మాణం కూడా ఉంది. అయితే, ఈ పార్టీలో ఒకప్పుడు మాదిరిగా సంఘ్ పరివార్, ఆర్ఎస్ఎస్, హిందూత్వ నినాదంతో పని చేసే పలు సంస్థల నుంచి వచ్చే నాయకులకు బాగా ప్రాధాన్యత ఉంటుండేది. కానీ, మారుతున్న రాజకీయ పరిస్థితుల రిత్యా కొత్తగా పార్టీలో చేరిన వారికి ప్రయారిటీ లభిస్తున్నది. బీజేపీ అధిష్టానం తాజాగా ప్రకటించిన లోక్ సభ స్థానాల్లో తెలంగాణ నుంచి పోటీ చేయబోయే 9 మంది అభ్యర్థులున్నారు. సదరు జాబితాలో ఒరిజినల్ బీజేపీ కంటే ఫిరాయింపుదారులకే ఎక్కువగా ఉండటం గమనార్హం.

రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా ఉన్నా..లోక్ సభ ఎన్నికల్లో మాత్రం బీజేపేదే పై చేయి అని రాజకీయ వర్గాల అభిప్రాయం. గత ఎన్నికలను పరిశీలిస్తే ఆ విషయం సుస్పష్టమవుతోంది కూడా. అయితే, పార్టీలో ఏండ్ల కొద్ది పని చేస్తున్న వారికి కాకుండా కొత్తగా వచ్చి సంవత్సరాలు, నెలలు, గంటల వ్యవధి అనే తేడా లేకుండా టికెట్లు ఇస్తుండటం పట్ల సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలుండగా, ఇటీవల ప్రకటించిన 9 స్థానాల్లో ముగ్గురు సిట్టింగ్ లకు టికెట్లు కన్ఫర్మ్ చేయగా, మిగతా స్థానాల్లో వేరే వారికి అవకాశమిచ్చారు. కరీంనగర్, సికింద్రాబాద్, నిజామాబాద్ లలో సిట్టింగ్ ఎంపీలనే అభ్యర్థులుగా ప్రకటించారు.

ఇక దేశంలోనే అతి పెద్ద నియోజకవర్గం..36 లక్షల మంది ఓటర్లుండే మల్కాజ్ గిరి బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను ప్రకటించారు. ఈ సీటు కోసం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధినేత మల్క కొమురయ్య, బీజేపీ జాతీయ నాయకులు మురళీధర్ రావు, రామ్ చందర్ రావు వంటి వారు రేసులో ఉన్నారు. కాగా, వారెవరినీ కాదని గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయిన నేతకు అవకాశమిచ్చారు. దాంతో కొంత టికెట్ ఆశించి భంగపడ్డ నేతల వర్గీయులు అసంతృప్తి చెందుతున్నారు. కాగా, బీజేపీ అధిష్టానం తనదైన అంచనాతోనే టికెట్లను ప్రకటిస్తోందనేది పలువురి వాదన.

రాజకీయ పరిశీలకుల విశ్లేషణల ప్రకారం..మల్కాజ్ గిరి లోక్ సభ సీటు..హైదరాబాద్ సిటీకి దాదాపుగా దగ్గర్లోనే ఉంటోంది. దానికి తోడు అందరికీ పరిచయమైన వ్యక్తి బీజేపీ తరఫున బరిలో ఉండటం ద్వారా లాభం చేకూరుతుందనే అంచనాతో ఈటల రాజేందర్ ను బరిలోకి దించినట్లు స్పష్టమవుతోంది.

లోక్ సభ ఎన్నికలకొచ్చేసరికి..‘జాతీయ వాదం’ అనే అంశం తెరమీదకు వస్తోందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దానికి తోడు హైదరాబాద్ స్థానం నుంచి మాధవీలత అనే మహిళకు నూతనంగా అవకాశం ఇవ్వడం కూడా చర్చనీయాంశమవుతోంది. ఇక భువనగిరి, చేవెళ్ల స్థానాల నుంచి గతంలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిన బూర నర్సయ్య గౌడ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డిని రంగంలోకి దించారు.

అయితే, బీజేపీలోకి చేరిన రోజులు, గంటల వ్యవధిలోనే జహీరాబాద్, నాగర్ కర్నూల్ టికెట్ లను అభ్యర్థులు తెచ్చుకోవడం గమనార్హం. నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపీ రాములు బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరారు. ఆయన తనయుడు భరత్ ను బీజేపీ అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించింది. ఇక జహీరాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీగా బీఆర్ఎస్ తరఫున ఇప్పటి వరకు ఉన్న బీబీ పాటిల్..ఇక ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా మరోసారి బరిలోకి దిగుతున్నారు. అయితే, స్థానికంగా బలంగా ఉన్న లింగాయత్ కమ్యూనిటీ లీడర్ అవడంతో పాటు ఆనుకుని ఉన్న కర్ణాటక ఓటింగ్ ప్యాటర్న్ బీజేపీకి బలమవుతుందనే అంచనాతో కమలనాథులో ఈ మేరకు టికెట్ అనౌన్స్ చేసినట్లు స్పష్టమవుతోంది. చూడాలి మరి..ఫిరాయింపుదారులతో బీజేపీకి తెలంగాణ లోక్ సభ లో గతాన్ని మించిన సీట్లు వస్తాయో.. లేదో..

– అంబీర్ శ్రీకాంత్,
సెల్: 81859 68059.